- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి దూకుడు పెంచాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కాలరీస్ కీలక పాత్ర పోషించాలని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలి
- కోల్ గ్యాసిఫికేషన్ వైపు అడుగులు వేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో : దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కాలరీస్ కీలక పాత్ర పోషించాలని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న 10-15 ఏళ్లకు సరిపడా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ పనితీరుపై శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు, గనుల శాఖ నిర్వహించే వేలంలో సింగరేణి చురుకుగా పాల్గొని కొత్త బ్లాకులను దక్కించుకోవాలని సూచించారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రామగుండం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను చేపట్టాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కార్మికులకు అవగాహన కల్పించాలి
సింగరేణి అభివృద్ధి, సంస్కరణలపై కార్మికులకు పూర్తి అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా విద్యుత్ ఉత్పాదనకు ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. రవాణా కాంట్రాక్టులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ హోదా, అటవీ భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు రవాణా సమస్యలను పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సింగరేణి డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






