Kishan Reddy: యూపీఏ కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకునే వేలం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
Kishan Reddy: యూపీఏ కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకునే వేలం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం 2047 నాటికి సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఖనిజరంగం పాత్ర అత్యంత కీలకమని, గత పదేళ్లుగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో బొగ్గు, గనుల రంగంలో సానుకూల మార్పులు కనబడుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంజీఎంఐ (మైనింగ్, జియాలజికల్, మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో గనులరంగంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి.. గనుల రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి వివరించారు. భారతదేశంలో విద్యుదుత్పత్తిని పెంచేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అలాగే గనుల తవ్వకంలో మొదటి దశ అయిన ఎక్స్‌ప్లొరేషన్ ప్రక్రియలో 50% ఖర్చును భరించేందుకు కేంద్రం ముందుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేగాక యూపీయే ప్రభుత్వంలో గనుల కుంభకోణాన్ని దృష్టిలో ఉంచుకుని, పారదర్శకమైన పద్ధతిలో వేలం విధానాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. భారతదేశంలో ‘మిషన్ కోకింగ్ కోల్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని, 2030 నాటికి 140 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తే ఈ మిషన్ లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఆయా సంస్థల సీఈవోలు, చైర్మన్లతో జరిగిన సమావేశంలో.. గనుల రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, తీసుకురావాల్సిన సంస్కరణలు తదితర అంశాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అందరి సహకారంతో భారతదేశాన్ని గనులు, ఖనిజాల రంగంలో ఆత్మనిర్భర్ గా మార్చేందుకు కృషిచేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

Next Story