కూనంనేని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : తాండ్ర వినోద్

by Batti.Sumithra |

కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవి, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ రావు తాండ్ర తెలిపారు.

కూనంనేని బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : తాండ్ర వినోద్
X

దిశ, కొత్తగూడెం టౌన్ : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవి, అనుచితమైనవి, రాజకీయ నిరాశను స్పష్టంగా ప్రతిబింబించేవిగా ఉన్నాయని, వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ రావు తాండ్ర తెలిపారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసిన నాయకుడిగా, అలాగే ఆయన ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గం ఈ పార్లమెంటు పరిధిలోనే ఉన్న నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని స్పష్టంగా చెబుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక సిద్ధాంతపరమైన విమర్శ కాదు ఇవి పూర్తిగా రాజకీయ నిరాశ నుంచి వచ్చిన ఆవేదన మాత్రమే అన్నారు.

గత పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి, స్థిరత్వం, భద్రత వైపు నడిపిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ నాయకత్వం పై ప్రజల విశ్వాసం మరింత బలపడుతున్న నేపథ్యంలో కొన్ని రాజకీయ శక్తులు తమ అసహనాన్ని ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా వ్యక్తపరుస్తున్నాయి. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీ నాయకత్వంలో దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన, విజయవంతమైన చర్యలు, ముఖ్యంగా ఇటీవల జరిగిన కీలక భద్రతా ఆపరేషన్లు, దేశ శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలిచాయి. ఈ విజయాలు కొంతమందిలో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. వాదనలు తీరిపోయినప్పుడు — దూషణలకు దిగుతారు. సిద్ధాంతాలు విఫలమైనప్పుడు — వ్యక్తిగత వ్యాఖ్యలకు పాల్పడతారు. రాజకీయ ప్రాధాన్యత తగ్గినప్పుడు — సంచలనాలకు ప్రయత్నిస్తారు అని అన్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులు. అభివృద్ధి కోసం పనిచేసే పాలన ఏదో, నిరాశతో నెగెటివిటీని వ్యాప్తి చేసే రాజకీయాలు ఏవో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. కూనంనేని సాంబశివ రావు గారు తమ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, ప్రజాజీవితంలో ఉన్న నాయకులు మాటల పట్ల ఎంత బాధ్యత వహించాలో ఆలోచించాలని నేను కోరుతున్నాను.

Next Story