- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకొద్దు బాబోయ్.. డబుల్ బెడ్ రూం ఇండ్లు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు మాకొద్దంటూ లబ్ధిదారులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

మాకొద్దు బాబోయ్.. డబుల్ బెడ్ రూం ఇండ్లు
- భయపడుతున్న లబ్ధిదారులు
- బీఆర్ఎస్ హయాంలో నాసిరకంగా నిర్మాణాలు
- పగుళ్లుబారుతున్న పిల్లర్లు.... బయటపడుతున్న ఇనుప సువ్వలు
- విప్పలమడక గ్రామసభలో లబ్ధిదారులు తీర్మానం
దిశ, వైరా : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు మాకొద్దంటూ లబ్ధిదారులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఈ ఇళ్ల పేరు చెబితేనే లబ్ధిదారులు జంకుతున్నారు. అసంపూర్తిగా నిర్మించిన ఈ ఇళ్లను తమకు కేటాయించవద్దని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అసంపూర్తిగా నిర్మించిన ఈ ఇల్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వైరా మండలంలోని విప్పలమడక గ్రామానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఈ ఇళ్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. ఇంటి నిర్మాణం కోసం పిల్లర్లు పోసి స్లాబ్ వేశారు. ప్రస్తుతం ఆ నిర్మాణాలు నామరూపాలు కోల్పోయాయి. పిల్లర్లు నెర్రెలు బారటంతో పాటు స్లాబులోని ఇనుప సువ్వలు బయట పడి దర్శనమిస్తున్నాయి. నాణ్యత లేకుండా అసంపూర్తిగా నిర్మించిన ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ గ్రామంలోని లబ్ధిదారులు ఈ ఇళ్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.
గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం..
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములను లబ్ధిదారుల కేటాయించేందుకు ఇటీవల విప్పలమడక గ్రామంలో తహసిల్దార్ కెవి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఆ సమయంలో లబ్ధిదారులతో పాటు గ్రామస్తులు అసంపూర్తిగా ఉన్న ఆ డబుల్ బెడ్ రూములు మాకు వద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అసంపూర్తిగా నిర్మించిన ఆ ఇల్లు శిథిలావస్థకు చేరాయని వారు గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాకొద్దు అంటే.....మాకొద్దు బాబోయ్ అంటూ లబ్ధిదారులు గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములను లబ్ధిదారులకు కేటాయించి మిగిలిన ఇంటి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆ ఇళ్ళు ఏ దశలో ఉన్నాయో ఆ దశ నుంచి లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిర్మాణంలో పూర్తి నాణ్యత లోపం ఉన్న విప్పలమడకలోని డబుల్ బెడ్ రూములను తీసుకునేందుకు లబ్ధిదారులు నిరాకరించారు.
పలు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక.....
బీఆర్ఎస్ హయంలో వైరా మండలంలోని పలు గ్రామాల్లో అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను లబ్ధిదారులకు ఇటీవల కేటాయించారు. మండలంలోని గరికపాడు గ్రామంలో 15, కొండకుడిమ గ్రామంలో 37, ఖానాపురం గ్రామంలో 23, అష్టగుర్తి గ్రామంలో 45 ఇళ్ళు అసంపూర్తిగా నిర్మించి ఉన్నాయి. అయితే ఆయా గ్రామాల్లో ఇటీవల అధికారులు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులు కేటాయించి మిగిలిన ఇంటి పనులను పూర్తి చేసుకునే వెసులుబాటు వారికే కల్పించారు. విడతల వారీగా వారు చేసే పనులకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించనుంది. అయితే ఒక్క విప్పలమడక గ్రామంలోనే నాణ్యతలేని అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తీసుకునేందుకు లబ్ధిదారులు నిరాకరించారు






