భూగర్భ డ్రైనేజిపై నీలినీడలు.. ఆ పనులు పెండింగ్

by Malleboina Mahesh |

ఖమ్మంలోని ఖానాపురం ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీకి భూసేకరణ అడ్డుగా మారింది.

భూగర్భ డ్రైనేజిపై నీలినీడలు.. ఆ పనులు పెండింగ్
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మంలోని ఖానాపురం ఊర చెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీకి భూసేకరణ అడ్డుగా మారింది. మొత్తం 87 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం కొనసాగిస్తున్నారు. మ్యాన్‌హోల్స్, మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు ధంసలాపురం వద్ద భూసేకరణకు అడ్డంకులు ఏర్పడటం తో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంపై నీలి నీడలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ నిర్మాణం ఆలస్యమయ్యే సూచనలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకుంటే ఖానాపురం చెరువు వరద నీటితో పలు డివిజన్లు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంది.

9 కిలోమీటర్ల మేర నిర్మాణం

ఖానాపురం ఊర చెరువు నుంచి మున్నేరు కలిసే దంసలాపురం చెరువు వరకు 9 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే నగరంలోని మూడో డివిజన్‌తో సహా ఏడు డివిజన్లలో వరద ముప్పు తగ్గుతుంది. దీనికోసం 9 కిలోమీటర్ల మేర 475 మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా పుట్ట కోట ధంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీటిని దంసలా పురం చెరువులో వదిలేందుకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేశారు.

మురుగు నీరు బయటకు పంపేందుకు..

ఏడు డివిజన్ల పరిధిలో ప్రతి ఇంటి నుంచి మురుగునీటిని భూగర్భ డ్రైనేజీలోకి పంపేలా, అలుగు నిర్మాణం, మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇంకా 50 వరకు మ్యాన్ హోల్స్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఇక అలుగు నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలా ఉంది. భూగర్భ డ్రైనేజి నిర్మాణం 18 నెలలుగా సాగుతుండటంతో మురుగు సమస్య ముందుకు వచ్చింది. ముంపు ఆందోళణ ప్రజల్లో నెలకొంది.

ముందుకు సాగని మురుగునీటి శుద్ధి..

భూగర్భ డ్రైనేజీ ద్వారా వచ్చిన మురుగు నీటిని శుద్ధి పరిచే కేంద్రాల నిర్మాణం ముందుకు సాగడం లేదు. పుట్ట కోట వద్ద రెండున్నర ఎకరాలు భూసేకరణ చేసి రోజుకు 9.5మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రం నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఏడాదికాలంగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇక దంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి సుమారు ఏడెకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకు అనేక అడ్డంకులు ఏర్పడటం తో ఇంతవరకు మురుగు నీటి శుద్ధి కేంద్రం నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం సకాలంలో అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

నెల రోజుల్లో పూర్తి చేస్తాం

భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని నెల రోజుల్లో గా పూర్తి చేస్తాం. మ్యాన్ హోల్స్ నిర్మాణం పూర్తి చేసి, పైపుల అమరిక చేపడతాం. దంసలాపురం వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉంది. అడ్డంకులు ఎదురవుతున్నా వాటిని అధిగమించి, నిర్మాణం చురుగ్గా కొనసాగిస్తున్నాం.:-ప్రజారోగ్య శాఖ ఈఈ, రంజిత్ కుమార్

Next Story