ఖమ్మం వేదికగా త్వరలో “ఉమ్మడి ఖమ్మం -సామాజిక న్యాయ సభ” - డాక్టర్ అవ్వారు వేణు కుమార్

by I. Sairam |

ఖమ్మం జిల్లా వేదికగా తర్వలో "ఉమ్మడి ఖమ్మం జిల్లా -సామాజిక న్యాయ సభను" నిర్వహించబోతున్నట్లు ముఖ్య అతిథులుగా హాజరైన బిసిఐఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్స్ ,డాక్టర్ అవ్వారు వేణు కుమార్, ప్రొఫెసర్ వీరస్వామి, కర్నాటి మనోహర్ నేత తెలిపారు.

ఖమ్మం వేదికగా త్వరలో “ఉమ్మడి ఖమ్మం -సామాజిక న్యాయ సభ” - డాక్టర్ అవ్వారు  వేణు కుమార్
X

దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా వేదికగా తర్వలో "ఉమ్మడి ఖమ్మం జిల్లా -సామాజిక న్యాయ సభను" నిర్వహించబోతున్నట్లు ముఖ్య అతిథులుగా హాజరైన బిసిఐఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్స్ , డాక్టర్ అవ్వారు వేణు కుమార్, ప్రొఫెసర్ వీరస్వామి, కర్నాటి మనోహర్ నేత తెలిపారు. శుక్రవారం ఖమ్మం పట్టణంలో బిసి ఇంటలెక్చువల్ ఫోరం - ఉమ్మడి ఖమ్మం' జిల్లా ఆధ్వర్యంలో... బిసిఐఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ పద్మ నేతృత్వంలో ఖమ్మం రెడ్ క్రాస్ సొసైటీ వేదికగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అవ్వారు వేణు కుమార్, ప్రొఫెసర్ వీరస్వామి, కర్నాటి మనోహర్ నేతలు మాట్లాడుతూ... బీసీలకు 42% అమలు కావాలంటే దానికి ఏకైక మార్గం కేవలం 9వ షెడ్యూల్‌ ద్వారా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించిందని, కానీ ఈ హామీ నీటి మూట అని తేలిపోయిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, 42% రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించాలని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు తమకు దక్కాల్సిన వాటా 42 శాతాన్ని అమలు చేసేంతవరకు ఎన్నికలకు వెళ్లవద్దని సూచించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్, ప్రేక్షక పాత్ర వహించడం మానేసి, ఈ అంశాన్ని తక్షణమే టేకప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం జనగణలో కుల గణన చేస్తామని హామీ ఇచ్చి మరోసారి మోసానికి సిద్ధమైందని విమర్శించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగే హౌస్ హోల్డ్ షెడ్యూల్ కాన్వాసింగ్ లొ 33 కాలమ్స్ ఉండగా అందులో కాలం నెంబర్ 12 లో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు.

బీసీ లను వదిలి వేస్తున్నారు. ఇది జనగణనలో కులగనను నీరుగార్చడమేనని వారు విమర్శించారు బీజేపీ – బీఆర్‌ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల పట్ల బాధ్యతగా నిలబడి, 42% రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి, బీసీలకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కర్నాటి మనోహర్ నేత మాట్లాడుతూ మేమెంతో మాకు అంత మా నినాదం, అలాగే హిస్సా, ఇజ్జత్, హుకుమత్ మా ఉద్యమ నినాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు పిండిపూలు రామ్మూర్తి, పద్మశాలి సంఘం పొలిటికల్ ఫోరం కన్వీనర్ గుంటి నగేష్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి, మున్నూరు కాపు సంఘం మూల గుండ్ల శ్రీహరి, శాలివాన సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీపతి, బీసీ విద్యార్థి యువజన అధ్యక్షులు రమణ, వినయ్,అనిల్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story