- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బువ్వ లేదు.. బుక్కి లేదు.. వండేందుకు గ్యాస్ లేదు
బువ్వలేదు.. బుక్కి లేదు.. వంట వండేందుకు గ్యాస్ లేదు. ప్రస్తుతం ఇది మణుగూరు మండలంలో నెలకొన్న దుస్థితి.

దిశ, మణుగూరు : బువ్వలేదు.. బుక్కి లేదు.. వంట వండేందుకు గ్యాస్ లేదు. ప్రస్తుతం ఇది మణుగూరు మండలంలో నెలకొన్న దుస్థితి. మండలంలో వంట గ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీల ఎదుట తెల్లవారు జాము నుంచే ప్రజలు భారీగా పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాస్ కోసం ఆన్ లైన్ చేసుకునేందుకు ఎండ ను సైతం లెక్కచేయకుండా క్యూలైన్లో నిలబడుతున్నారు. ఇళ్లలో వంట చేసుకునేందుకే గ్యాస్ లేదు మొర్రో అంటే ఇక హోటళ్లు, రెస్టారెంట్ ల పరిస్థితి మరింత దారుణంగా తయారయింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది డీలర్లు గ్యాస్ ను పక్కదారి పట్టిస్తున్నారు. అవసరాన్ని ఆసరాగా చేసుకుని సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. దీంతో సామాన్యుడికి వంటగ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఆఖరికి కట్టెల పొయ్యిపై వంటలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఒకవేళ గ్యాస్ బుక్ చేసుకున్న సరే అది ఎప్పటికీ వస్తుందో అర్థం కాని పరిస్థితులలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఒకపక్క అసలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా.. సామాన్యుడికి గ్యాస్ మాత్రం అందరి ద్రాక్షగా తయారైంది. డీలర్లకు వంట గ్యాస్ ఒక వరంలా తయారయ్యింది. అవసరం కోసం సామాన్యుడు ఏదైనా చేస్తాడనే ధీమాతో కొందరు డీలర్లు ఏకంగా ఒక్క సిలిండర్ ను 2600 రూపాయలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో డీలర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి ఎస్ ఏజెన్సీలపై తనిఖీలు నిర్వహించాలని, సామాన్యులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






