సింగరేణిలో మధ్యవర్తి మాయాజాలం

by Malleboina Mahesh |

ఒక చైన్‌మెన్ తన మెదడుకు పదును పెట్టి... ఐటీని సైతం లూటీ చేసేస్తున్నాడు. తనకు కమిషన్ ఇస్తే చాలు ఐటీ రిటర్న్ చేయిస్తా అంటూ చేసి చూపిస్తున్నాడు.

సింగరేణిలో మధ్యవర్తి మాయాజాలం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఒక చైన్‌మెన్ తన మెదడుకు పదును పెట్టి.. ఐటీని సైతం లూటీ చేసేస్తున్నాడు. తనకు కమిషన్ ఇస్తే చాలు ఐటీ రిటర్న్ చేయిస్తా అంటూ చేసి చూపిస్తున్నాడు.. టెక్నాలజీని సైతం బురిడీ కొట్టించి ఏదో ఒక విధంగా ఉద్యోగి చెల్లించే ఇన్కమ్ టాక్స్‌ను మళ్లీ వారికి వచ్చేలా చేసేస్తున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ఐటికి ఎగనామం పెడుతూ దర్జాగా సింగరేణిలో ఈ మధ్యవర్తి మాయాజాలం సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలో భారీగానే బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టి కోట్లకు పడగెత్తాడు.

సింగరేణి సంస్థలో... అతను ఒక చైన్‌మెన్.. సాధారణ ఉద్యోగి తన విధులు నిర్వర్తించుకుని, ప్రతి నెల జీతం తీసుకునే వ్యక్తి.అయితే అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో గానీ, తనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు ప్రభుత్వానికి కోట్లలో ఎగనామం పెట్టేస్తోంది. కొంతమంది అమాయక ఉద్యోగులను ఆసరాగా చేసుకుని సుమారు 500మంది సింగరేణి ఉద్యోగులే కస్టమర్ లుగా ఈ దందాలు చేస్తున్నాడు. ప్రతి ఏడాది చారిటీ, ఎడ్యుకేషన్, వైద్యం, డొనేషన్లు, హౌస్ రెంట్ ఎలివన్స్ ఇచ్చినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలో చక్రం తిప్పేస్తున్నాడు. ఉద్యోగులు చెల్లించే ఇన్కమ్ టాక్స్ వారికి మళ్లీ వచ్చేలా నకిలీ బిల్లులు చూపిస్తూ భారీగానే కమీషన్లు తీసుకుని, ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. తనకు ఇంత సంపద ఎలా వచ్చిందని మళ్లీ ప్రశ్నిస్తారేమో అని ముందే ఆలోచించి బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. దర్జాగా డ్యూటీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేస్తున్నాడు.

ప్రతి ఉద్యోగికి ఇన్కమ్ టాక్స్ రిటర్న్ వచ్చేలా..?

సదరు చైన్ మెన్ సింగరేణిలోని కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలోని సుమారు 500 మంది ఉద్యోగులను ఆసరాగా చేసుకొని ప్రతి ఏడాది వారు చెల్లించే ఇన్కమ్ టాక్స్‌ను వారికి ఖచ్చితంగా తిరిగి వచ్చేలా చేస్తున్నాడు. ఈ దందా గత మూడేళ్లుగా కొనసాగుతుంది. వచ్చిన సొమ్ములో 20 శాతం నుంచి 30 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాడు. అయితే ఉద్యోగులు ఇన్కమ్ టాక్స్ చెల్లించిన తర్వాత ఉద్యోగుల ద్వారా చారిటీకి ఇస్తున్నట్లు, లేదా ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్నట్టు, వైద్యానికి కేటాయిస్తున్నారు. లేదా అనాథ వృద్ధ శరణాలయాలకు డొనేషన్లు ఇస్తున్నట్లు చూయించి, నకిలీ పత్రాలు సృష్టిస్తున్నాడు.

అవి ఏ అధికారి చూసినా ఏ రకంగా పరిశీలించిన అనుమానాలు రాకుండా పకడ్బందీగా ఆ డాక్యుమెంట్లు తయారు చేసి అధికారులకు అందజేస్తున్నారు. దీంతో ప్రతి ఉద్యోగి చెల్లించే ఇన్కమ్ టాక్స్ మళ్లీ వారికి తిరిగి వచ్చేస్తుంది. ఇందుకోసం సదరు ఉద్యోగుల నుంచి వారి ఫోన్ నెంబర్ ఓటీపీ మాత్రమే చెప్పాలని ముందే వారిని ప్రిపేర్ చేసి ఈ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వచ్చినప్పుడు చెప్పగానే మళ్లీ ఉద్యోగుల ఖాతాలోకి డబ్బులు జమ అయిపోతున్నాయి. దీనికోసం ఫామ్ 10, ఫామ్ 12 ఉంటాయని వాటిని పూర్తి చేసి డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే ఐటీ రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. దీని ఆధారంగానే సదరు ఛైన్ మెన్ భారీ కుంభకోణానికి తెరలేపినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఐటీ కమిషన్‌లతో రూ.కోట్లకు పడగలు..

ఒక ఉద్యోగి ఏడాదికి కనీసం లక్షన్నర వరకు ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తారు. అయితే సదరు చైన్‌మెన్ మధ్యవర్తిగా మారి మాయాజాలంతో ఆ డబ్బులు మళ్లీ మీకు వచ్చేలా చేస్తానని, అందులో వచ్చిన సొమ్ములో 30 శాతం తనకు కమీషన్ ఇవ్వాలని ఒప్పుకొని, తానే నకిలీ డాక్యుమెంట్లను తయారుచేసి ఆన్‌లైన్ చేసి, ఇన్కమ్ టాక్స్ ఆఫీస్‌కు పంపించేస్తున్నాడు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో సదరు ఉద్యోగులకు తెలియదు. దీంతో ఐటీ కమీషన్లతోనే సదరు సింగరేణి చైన్‌మెన్ కోట్లకు పడగెత్తినట్లు తెలుస్తోంది. ఎంత కాదనుకున్నా ఒక్కో ఉద్యోగం నుంచి రూ.50 వేల వరకు కమిషన్ వస్తుండటంతో తన లూటీ దర్జాగా జరుగుతోందని భావించి ప్రతి ఏడాది ఇదే తంతు చేస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ బిల్లులతో ఐటికే ఎగనామం పెట్టిన సదరు హెడ్ చైన్ మెన్‌పై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు.

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం

ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చేపించి కమీషన్ తీసుకుంటున్నారని నా దృష్టికి రాలేదు. సంస్థలోని ఉద్యోగి ఎవరైనా ఈ విధంగా చేసి ఉద్యోగుల వద్ద నుంచి కమిషన్ తీసుకున్నట్లు మా దృష్టికి వస్తే సదరు వ్యక్తులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.- సత్తుపల్లి ఏరియా జీ ఎం చింతల శ్రీనివాస్

Next Story