తప్పిన భారీ ప్రమాదం

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా, నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది.​ లారీ ఢీకొన్న ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురై ఒక్కసారిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవరుకు అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం సేవించి ఉండటంతోనే డ్రైవర్ తన నియంత్రణ కోల్పోయి, రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఒకవేళ వేగం ఇంకా ఎక్కువగా ఉంటే ప్రాణనష్టం జరిగేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న బూర్గంపాడు పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు.

Next Story