అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

by Taduka Kalyani |

సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయపోరాటానికి ఎఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు.

అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి అధికారుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం, ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయపోరాటానికి ఎఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. సింగరేణి అధికారుల సంఘం (సీఎంఓఏ) ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట మంగళవారం నిర్వహించిన రెండో రోజు నిరసన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాత్రింబవళ్లు శ్రమిస్తూ సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అధికారుల పే రివిజన్, అలవెన్సులు, పదోన్నతులు, ఇతర పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంస్థ లాభాల్లో అధికారులకు న్యాయమైన వాటా కల్పించడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు, సంక్షేమ ప్రయోజనాలు అందించడం యాజమాన్యం బాధ్యత అని పేర్కొన్నారు. అధికారుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సంస్థ అభివృద్ధికే ప్రతికూలమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని అధికారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శులు వి. మల్లికార్జున్ రావు, రమణమూర్తి, కత్తెర్ల రాములు, జె. గట్టయ్య, హుమాయూన్, కమల్, మధుకృష్ణ, మండల రాజేశ్వరరావు, సీఎంఓఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story