మూఢనమ్మకంతో మృతదేహాలను ఇంట్లోకి తీసుకురాకుండా అడ్డుకున్న ఇంటి యజమాని

by Kodari Anjali |

భద్రాచలం నడిబొడ్డున అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.

మూఢనమ్మకంతో మృతదేహాలను ఇంట్లోకి తీసుకురాకుండా అడ్డుకున్న ఇంటి యజమాని
X

దిశ, భద్రాచలం: భద్రాచలం నడిబొడ్డున అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాల పేరుతో మృతదేహాలను ఇంట్లోకి తీసుకురాకుండా, ఇంటి యజమాని గేట్ కు తాళం వేసి అడ్డుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళ్తే... విలీన గ్రామం తోటపల్లికి చెందిన దూడల శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 న హార్ట్ అటాక్‌తో మృతి చెందాడు. నాలుగు నెలలు గడవక ముందే ఆదివారం ములకలపల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు సాయి ప్రకాష్, కోడలు, మనవడు మృతి చెందారు.

ఇంటి యజమాని తీరుపై..

ఈ మృతదేహాలను ఆదివారం వెంకటేశ్వర కాలనీలోని అద్దె ఇంటికి అంబులెన్సులో తీసుకురాగా... మృతదేహాలను ఇంట్లోకి తీసుకుని రావడానికి వీలు లేదంటూ, ఇంటి యజమాని సాంబశివరావు ప్రధాన గేట్‌కు తాళం వేసాడు. ఎందరో నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. చివరకు కేసు పెడతామని బెదిరించినా, తనకు కీడు సోకుతుందనే మూఢ నమ్మకంతో ఇంటి యజమాని తాళాలు తియ్యలేదు. దీంతో దూడల శ్రీనివాస్ కోడలు పుట్టిల్లు పురుషోత్తమపట్నం గ్రామానికి మృతదేహాలను తీసుకుని వెళ్లి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇంటి యజమాని తీరుపై సీపీఎం నాయకులు ఎంబి నర్సారెడ్డితో పాటు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన సాయి ప్రకాష్ మరో 15 రోజుల్లో తండ్రి శ్రీనివాస్ స్థానంలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం ప్రజల హృదయాలను ద్రవింపజేసింది.

Next Story