చుక్కాని లేని నావలా వైరా బీఆర్ఎస్.. నెలన్నర దాటినా ఇన్చార్జ్‌ను నియమించని అధిష్టానం

by Kodari Anjali |

స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది.

చుక్కాని లేని నావలా వైరా బీఆర్ఎస్..  నెలన్నర దాటినా ఇన్చార్జ్‌ను నియమించని అధిష్టానం
X

దిశ, వైరా: స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. గత నెలన్నర రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి ఇంచార్జ్ కరువయ్యారు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా పనిచేసిన బానోత్ మదన్ లాల్ గత మే 27వ తేదీన గుండెపోటుతో దుర్మరణం చెందారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అధిష్టానం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్‌ను నియమించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇన్చార్జ్ లేకపోవడంతో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. బానోత్ మదన్ లాల్ మృతితో ఖాళీ అయిన ఇన్చార్జ్ పోస్టుకు పలువురు పోటీ పడుతున్నారని ప్రచారం జరుగుతుంది.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మదన్ లాల్ కుటుంబ సభ్యులకే ఇన్చార్జ్ పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. మదన్ లాల్ భార్య బానోత్ మంజులకు వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గృహిణిగా ఉన్న ఆమె రాజకీయాల్లో రాణిస్తారో లేదో అనే చర్చ జరుగుతుంది. అదేవిధంగా వైరా మాజీ ఎమ్మెల్యే, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు భానోత్ చంద్రావతి వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతుంది.

2009 సంవత్సరంలో మహా కూటమి తరపున సిపిఐ అభ్యర్థిగా ఆమె పోటీ చేసి వైరా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో చంద్రావతికి సిపిఐ పార్టీ వైరా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా నియమించింది. అప్పటినుంచి ఆమె అప్పటి టిఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

గత సాధారణ ఎన్నికల్లో కూడా వైరా సీటు కోసం ఆమె తనకున్న మార్గాల ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు. అంతేకాకుండా బీఆర్ఎస్ లో యువ నాయకుడు లకావత్ గిరిబాబు కూడా వైరా నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. గత పది సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్న ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్చార్జ్ పదవిని పొందేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఇంచార్జ్ పదవి కోసం ఈ ముగ్గురు మధ్య పోటీ నెలకొందని ప్రచారం జరుగుతోంది.

వీరితోపాటు మరికొంతమంది ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇన్చార్జ్‌ను నియమించకపోతే బీఆర్ఎస్ పార్టీకి వైరా నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనీసం పార్టీ వాయిస్ ను వినిపించే నాయకుడు లేకపోతే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్యాడర్ ముందుకు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అందువల్ల పార్టీ అధిష్టానం వెంటనే వైరా నియోజకవర్గ ఇన్చార్జ్‌ను నియమించాలని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు.

Next Story