దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. తీర‌నున్న రైతుల క‌ష్టాలు

by Ratna Kumari |   (  Updated:2026-03-25 15:21:20  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రైతుల దశాబ్దాల కల నెరవేరబోతోంది.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. తీర‌నున్న రైతుల క‌ష్టాలు
X

దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని రైతుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. మండల కేంద్రంలోని ఒంటి గుడిసె క్రాస్ రోడ్డు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శాశ్వత మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు బుధవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 3.03 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. నిర్మాణానికి సంబంధించి తొలుత భూమి చదును చేయడం, చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమాలకు అధికారులు, నాయకులు కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నెల రోజుల్లోపు భూమి చదును చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని, వచ్చే సీజన్ నాటికి మార్కెట్ యార్డ్ భవన నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శాశ్వత మార్కెట్ యార్డ్ అందుబాటులోకి వస్తే.. చుట్టుపక్కల గ్రామాల రైతులకు పంట ఉత్పత్తుల విక్రయాల్లో ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఎం.ఏ. అలీం, డి.ఇ. ఏలేష్, ఏన్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం, మార్కెట్ కార్యదర్శి అనూష, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story