- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం
- ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
దిశ, మధిర (ముదిగొండ ) : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సాయంత్రం డిప్యూటీ సీఎం ముదిగొండ మండలంలో పర్యటించి యడవల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులకు, యడవల్లి లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు, యడవల్లి ఎస్సీ కాలనీలో 68 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, మాదాపురం ఎస్సీ కాలనీలో 31 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, 12 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, ముదిగొండ గ్రామం ఎస్సీ కాలనీలో 59.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మధిర నియోజకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. శాశ్వత అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి మౌళిక వసతులను పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నియోజకవర్గ ప్రజల కోరికలు అవసరాలు దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, పేదలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 9 రోజులలో 9 వేల కోట్ల జమ, సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం అర్హులైన నిరు పేదలందరికి రేషన్ కార్డు అందిస్తున్నదని, ఇప్పటి వరకు 11 లక్షల పైగా పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు, పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామన్నారు .పిల్లల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. గురుకులాల్లో చదివే పిల్లలకు మెరుగైన ఆహారం అందించేందుకు 40 శాతం డైట్ చార్జీలు, కాస్మోటిక్స్ చార్జిలను 200 శాతం పెంచడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ ఇఇ వాణిశ్రీ, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






