- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. కబ్జాదారులకు కౌంట్‌డౌన్ ప్రారంభం..!
దిశ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన “కబ్జా కోరల్లో చిరుతనాల చెరువు” కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.

దిశ, పాల్వంచ టౌన్: దిశ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన “కబ్జా కోరల్లో చిరుతనాల చెరువు” కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. యానంబైల్ గ్రామ పరిధిలోని చిరుతనాల చెరువు ఆక్రమణల వ్యవహారంపై ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. చెరువు పరిధిలో అక్రమంగా సాగు కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా, చెరువు భూమిలో అక్రమంగా పోసిన గ్రావెల్‌ను పూర్తిస్థాయిలో తొలగించనున్నట్లు తెలిపారు. చెరువు అసలు విస్తీర్ణం, హద్దులను గుర్తించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం చెరువు సరిహద్దులను నిర్ధారించి హద్దు రాళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.
అధికారులు స్పందించడం గమనార్హం..
చెరువుకు సంబంధించిన రికార్డుల పరిశీలన, భూ సర్వే, హద్దుల నిర్ధారణ వంటి ప్రక్రియలకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఆక్రమణలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. కాగా, ఒకప్పుడు సుమారు 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిరుతనాల చెరువు ప్రస్తుతం కేవలం 6 ఎకరాలకు పరిమితమైందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. చెరువు భూములను ఆక్రమించి సాగుభూములుగా మార్చినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దిశలో కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించడం గమనార్హం. గ్రామస్థులు మాత్రం నోటీసుల జారీతో సరిపెట్టకుండా చెరువు ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించి, చెరువును యథాస్థితికి తీసుకురావాలని కోరుతున్నారు. ప్రజా అవసరాలకు కీలకమైన చెరువుల పరిరక్షణ విషయంలో అధికారులు వేగంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






