- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిరాయింపుదారులే మళ్లీ బరిలో!..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో.. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో పార్టీ మారిన అభ్యర్థులే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో.. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో పార్టీ మారిన అభ్యర్థులే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో ‘నిజాయితీగా పనిచేస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కల్పించండి’ అని అభ్యర్థించారు. తీరా కొత్తగూడెంలో సీపీఐ నుంచి గెలిచిన కొంతమంది కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీపీఐ ఈ స్థానాన్ని దక్కించుకోవడంతో మళ్లీ ఆ నాయకులే కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి సీపీఐ, సీపీఐ నుంచి కాంగ్రెస్ ఇలా ఒక్కొక్కరు పార్టీలు మారి, మళ్లీ ఇప్పుడు తమనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రిజర్వేషన్ల అంచనాలు తారుమారు కావడంతో ఇప్పటిదాకా భర్త కౌన్సిలర్‌గా ఉంటే ఇప్పుడు రిజర్వేషన్ మారడంతో ఆ స్థానంలో భార్యను పోటీ చేయిస్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని జెండాలు మోసిన వారు ఒకవైపు.. అధికారం కోసం పార్టీ, మారి మళ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నవారు ఇంకోవైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్‌లో కొత్త ముఖాలు కనిపిస్తాయా.. లేక మళ్లీ పార్టీ మారిన నాయకులే మళ్లీ టికెట్లు ఎగరేసుకుపోతారా అనే చర్చ నడుస్తున్నది. - దిశ, కొత్తగూడెం కార్పొరేషన్
దిశ, కొత్తగూడెం ప్రతినిధి : నిజాయితీగా పనిచేస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి... ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డులలో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తీరా గెలిచిన కొందరు నాయకులు పార్టీ కండువాలు మార్చారు. ఇప్పుడు గ్రామాలలో, పట్టణాలలో ముచ్చటగా మూడు పార్టీలు మారిన నాయకులే మళ్లీ మళ్లీ మమ్మల్ని గెలిపించాలని అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది.
పోటీ చేసేది పార్టీలు మారినవాళ్లే..
ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్‌లలో పార్టీ మారిన అభ్యర్థులే మళ్లీ మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం ఈ నాయకులకు అలవాటుగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచినవాళ్లు ఎంతో మంది గులాబీ కండువా కప్పుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి ఉద్యమకారుల్లా ఏమారి, ఉద్యమకారులను అణగద్కొక్కారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ మూడు రంగుల జెండాను కప్పుకొని అసలు కాంగ్రెస్ నాయకులం మేమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కొత్తగూడెంలో సీపీఐ నుంచి గెలిచిన కొంతమంది కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీపీఐ ఈ స్థానాన్ని దక్కించుకోవడంతో మళ్లీ ఆ నాయకులే కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు. ఇక కొంతమంది నాయకులైతే కాంట్రాక్టులు, పదవుల కోసం ఎర్రజెండాను కప్పుకొని మాది కమ్యూనిస్టు కుటుంబం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి ఏండ్లుగా నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా, పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే జెండాను మోస్తున్నవారు వీరి రాకతో వెనుకబెంచీకే పరిమితమయ్యారు.
అధికారం, డబ్బులే లక్ష్యమా..?
అధికారం ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామంటూ పార్టీ కండువాలను ఈజీగా కొందరు నాయకులు మార్చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టు పనులు చేసిన నాయకులు అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వెంటనే తమకు అలవాటైన విద్య పార్టీలు మారి మళ్లీ యథావిధిగా పెత్తనం చెలాయించడం చేస్తున్నారు. పార్టీ మారిన నాయకులు వార్డు అభివృద్ధి కోసమని బయటకు చెబుతున్నా.. వీరు కేవలం అధికారం, పైసలు సంపాదించడం, దందాలు చేయడం కోసమేనని బాహాటంగానే ప్రజలు ఆరోపిస్తున్నారు. వీళ్ల ప్రవర్తన, వ్యవహారం చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే భర్త ... లేకుంటే భార్య
ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో రిజర్వేషన్లతో కొందరి రాజకీయ జీవితాలు తారుమరయ్యాయి. ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచలలో ఒక్కోక్కరు మూడు పార్టీలు మారినవారే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి సీపీఐ, సీపీఐ నుంచి కాంగ్రెస్ ఇలా ఒక్కొక్కరు పార్టీలు మారి మళ్లీ ఇప్పుడు తమనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మళ్లీ ఈ నాయకులనే గెలిపిస్తే పార్టీ మారకుండా ఉంటారనే గ్యారంటీ అయితే లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్ల పుణ్యమా అని ఇప్పటిదాకా భర్త కౌన్సిలర్‌గా ఉంటే ఇప్పుడు రిజర్వేషన్ మారడంతో ఆ స్థానంలో భార్యను పోటీ చేయిస్తున్నారు. వారి ఇంట్లోని కుటుంబసభ్యులే నామినేషన్లు వేసి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే భర్త, లేకుంటే భార్య వీరే వార్డుల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి వ్యవహారంతో జెండాలు మోసిన కార్యకర్తలు జీవితాంతం జెండా కూలీలుగానే మారిపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ముఖాలకు చోటుందా...
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని జెండాలు మోసి అలసిపోయిన వారు ఒకవైపు అయితే... అధికారపార్టీ పేరు చెప్పుకొని కాంట్రాక్టులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో లక్షలాది రూపాయలు వెనుకేసుకుని పార్టీ మారి మళ్లీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నవారు ఇంకోవైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కార్పొరేషన్‌లో కొత్త ముఖాలు కనిపిస్తాయా.. లేక మళ్లీ పార్టీ మారిన నాయకులే మళ్లీ గెలిచి కౌన్సిల్‌లో అడుగుపెడుతారా..? మళ్లీ మళ్లీ అదే నాయకులను కౌన్సిల్‌కు పంపేందుకు రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయా..? లేక పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు, నాయకులకు అవకాశం ఇచ్చి వారిని కౌన్సిల్ మెట్లు ఎక్కిస్తారా..? అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






