వివాహిత అనుమానస్పద మృతి.. పోలీస్ వాహనం నడిపిన నిందితుడు

by Kodari Anjali |   (  Updated:2025-08-25 13:46:03  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రామాలయం వీధిలో నివాసముండే లక్ష్మీ ప్రసన్న(33) అనే వివాహిత అనుమానస్పద మృతి ఘటనలో మృతురాలి బంధువులు సోమవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివాహిత అనుమానస్పద మృతి.. పోలీస్ వాహనం నడిపిన నిందితుడు
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రామాలయం వీధిలో నివాసముండే లక్ష్మీ ప్రసన్న(33) అనే వివాహిత అనుమానస్పద మృతి ఘటనలో మృతురాలి బంధువులు సోమవారం ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఖాన్ ఖాన్‌పేటకు చెందిన పూల నరేష్ బాబుకు అదే మండలం విశ్వనాధపురంకు చెందిన లక్ష్మీ ప్రసన్న(33) తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి అశ్వారావుపేటలోని అక్క బావ విజయలక్ష్మి, ప్రముఖ ఇంజనీర్ దాసరి శ్రీను ఇంట్లో పూల నరేష్ బాబు కుటుంబంతో నివాసం ఉంటున్నారు.

ఆదివారం ఉదయం భార్య లక్ష్మీ ప్రసన్న ఇంట్లో మెట్లపై నుండి జారిపడి గాయపడడంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించానని భర్త నరేష్ బాబు భార్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఆస్పత్రికి వెళ్లిన కుటుంబ సభ్యులు విగతజీవిగా వెంటిలేటర్ పై ఉన్న లక్ష్మీప్రసన్న వంటిపై గాయాలు చిక్కి శల్యమైన ఆమె దేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతురు మృతికి భర్త నరేష్ బాబు, అతని అక్క పూల విజయలక్ష్మి, బావ దాసరి శ్రీనివాసరావు లు కారణం అంటూ మృతురాలు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

బంధువుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి

సోమవారం రాజమండ్రి నుండి భార్య లక్ష్మీ ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో అశ్వారావుపేట తీసుకువస్తుండగా కల్లూరు నుంచి వచ్చిన మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. భర్త పూల నరేష్ బాబును చితకబాదారు. పోలీసులు అడ్డుకొని భర్త నరేష్ బాబును అంబులెన్స్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గత రెండు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వకుండా, గృహనిర్బంధంలో ఉంచి తిండి పెట్టకుండా భర్త అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేయడంతోనే తన కూతురు లక్ష్మి ప్రసన్న మృతి చెందిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది ముమ్మాటికి హత్యనని ఆరోపిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సీఐ పింగళి నాగరాజు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు.. అన్యాయంగా తమ బిడ్డని పొట్టన పెట్టుకున్నారని న్యాయం చేయాలంటూ సీఐ కాళ్లపై పడ్డారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని నేరారోపణలు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సంయమనం పాటించాలని సీఐ కోరారు.

పోలీస్ వాహనం నడిపిన నిందితుడు

రాజమండ్రి నుండి లక్ష్మీ ప్రసన్న మృతదేహంతో వస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు మృతురాలు బంధువులు రాస్తారోకో చేస్తుండగా, ఈ ఘటనలో నిందితుడుగా ఉన్న దాసరి శ్రీనివాసరావు పోలీస్ వాహనం నడుపుతూ అక్కడినుంచి వెళ్లారు. దీనిపై మృతురాలి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ నిందితుడు పోలీస్ వాహనాన్ని నడుపుతూ దర్జాగా ఎట్లా వెళ్తాడని ప్రశ్నించారు. అయితే నిందితులపై దాడి జరిగే అవకాశం ఉండడంతో, రక్షణ కల్పించడంలో భాగంగా పోలీసు వాహనంలో వెళ్లి ఉండొచ్చని, లేదా నిందితుడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తనకు తానే పోలీస్ వాహనాన్ని ఉపయోగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిందితుడు భర్త నరేష్ బాబు సెల్ఫీ వీడియో

భార్య లక్ష్మీ ప్రసన్న అనుమానస్పద మృతి ఘటనపై భర్త పూల నరేష్ బాబు సెల్ఫీ వీడియోలో స్పందించాడు. భార్య మృతదేహంతో అంబులెన్స్‌లో వస్తూనే సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడాడు. నా భార్య చనిపోతే ఆ నిందలను అత్తగారింటి వారు నాపై వేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అత్తింటి వారు తమను పట్టించుకోలేదు, పెద్దమనుషులను పంపడం తప్ప వాళ్ళు వచ్చింది లేదు. నా భార్య చనిపోయి మాట్లాడలేదు కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు అబండాలు వేస్తూ.. తిండి పెట్టకుండా కడుపు మాడ్చి చంపారని హింసించామని ఆరోపిస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి. గతంలో గ్రామ పెద్దల పంచాయతీలలో తన తండ్రిదే తప్పని నా భార్య చెప్పింది. నా భార్య చనిపోయిందని బాధపడాలా అత్తింటి వారు నిందలు పడాల అర్థం కావడం లేదు. గతంలో నా భార్యకు ఉన్న ఎలర్జీ, బక్కగా ఉండటాన్ని కారణంగా చూపి నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు.

Also Read.

కూతుర్ని హతమార్చిన తల్లి.. చివరికి ఏం చేసిందంటే?

Next Story