- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు సర్వేలే ప్రామాణికం
ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తగూడెం, సుజాతనగర్‌లోని ఏడు గ్రామాలు, దశాబ్దంన్నర తర్వాత పాల్వంచకు మొత్తంగా కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యాక జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా టిక్కెట్ దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులతోనే పోటీ పడుతున్నారు. టిక్కెట్ దక్కించుకున్నాక ప్రత్యర్థి పార్టీలతో పోటీ పడటం ఎలాగు తప్పదు. కానీ ముందుగా టిక్కెట్ దక్కించుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులను దాటుకొని నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెం నియోజకవర్గంలో అధికారంలో ఉన్న సీపీఐ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీలు తమ పార్టీలో పనిచేస్తున్న నాయకుల పనితీరుపై అంచానా వేసేందుకు, టిక్కెట్లు కేటాయించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించారు.
అభ్యర్థులు ప్రచారం ప్రారంభం
కొత్తగూడెం కార్పొరేషన్‌లోనే అన్నీ రాజకీయపార్టీల నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. కార్పోరేషన్‌లో తమ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్‌లు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ ఆశిస్తున్న అన్నీ రాజకీయపార్టీలు నాయకులు డోర్ టు డోర్ ప్రచారం పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులను డోర్ పోస్టర్ రూపంలో ప్రతి ఇంటి గోడకు అతికించగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను గుర్తు చేస్తూ, అమలు చేయని గ్యారెంటీలపై రూపొందించిన పోస్టర్లను ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఈ డోర్ టు డోర్ ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పటికీ పోత్తులపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంపై ఎవరికీ వారే డివిజన్లలో ప్రచారం చేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
పొత్తుపై కాంగ్రెస్ శ్రేణుల అయిష్టత
అసలు పొత్తుకే ఇష్టపడని కాంగ్రెస్ శ్రేణులు ఒంటరిగా పోటీ చేయాలని పార్టీపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒంటరిగా వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్థానిక నాయకులు ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచే చెబుతున్నారు. పార్టీని నమ్ముకుని గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నామని, అధికారంలోకి వచ్చాక కూడా తమకు అవకాశం ఇవ్వకుండా పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉందని, తద్వారా పార్టీ అధినాయకత్వంపై నమ్మకం కోల్పోయి ప్రత్యర్థి పార్టీలు గెలిచేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొత్తుతో బీఆర్ఎస్ కే లాభం
సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదని తద్వారా బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ అభ్యర్థి ఉన్న చోట కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న చోట సీపీఐ సహకరించుకునే పరిస్థితి లేదని, ఫలితంగా అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లాభ పడే అవకాశం ఉందని నాయకులే బాహాటంగా చెబుతున్నారు. రాక రాక వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేజార్చుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి నాయకుల, క్రమశిక్షణ గల నాయకుల మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకే చేటు చేస్తుందంటున్నారు.
సర్వేలే ప్రామాణికంగా..
మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి సమావేశాలు పూర్తి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. సీపీఎంతో పొత్తు పెట్టుకుని ఒక అవగాహన ప్రకారం సీట్లు కేటాయించుకునేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీపీఐ ప్రస్తుతం తన కార్యకర్తలతో డివిజన్‌లలో సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. టిక్కెట్ ఆశిస్తున్న ఆశావాహులు, వారి ఆర్థిక స్థితిగతులు, వార్డుల్లో వారి వ్యక్తిగత ఇమేజ్, పార్టీకి ఉన్న సానుభూతిపరులు, పార్టీ కోసం పనిచేసిన వారు, పార్టీ మారినవారు, తదితర అంశాలన్నింటిపై బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో కొంత వెనుబడటంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఫలితాలు పునరావృతం కాకూడదవే ఉద్దేశ్యంతో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిపై ప్రత్యేకంగా సర్వే చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
సర్వేలో వచ్చిన మెజారిటీని బట్టి టిక్కెట్ కేటాయించాలని, స్థానిక నాయకుల లాబీయింగ్‌కు అవకాశం లేకుండా గెలిచే వ్యక్తులను ఎంపిక చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇక కొత్తగూడెంలో అధికారంలో ఉన్న సీపీఐ నాయకులు కూడా డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి టిక్కెట్ ఆశిస్తున్న వారు, గెలుపు అవకాశాలపై అంచానకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం అన్నీ మున్సిపాలిటీలలో పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించడం పార్టీలో పలువురు చేరడం కొంత ఉత్సాహాన్నిస్తుంది. ఏదీ ఏమైనా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అధికార పార్టీ పట్టు నిలుపుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెజారిటీ స్థానాలు గెలుచుకొని తమ ప్రాబల్యం చూపాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక షెడ్యూల్ వెలువడ్డాక ఏమి జరగుతుందోనని సగటు ఓటరు, పార్టీ సానుభూతిపరులు ఎదురుచూస్తున్నారు.






