పిస్తా హౌస్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఆహార నమూనాల సేకరణ

by Taduka Kalyani |

ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో బిర్యానీ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తిన్న అనంతరం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.

పిస్తా హౌస్‌లో ఆకస్మిక తనిఖీలు.. ఆహార నమూనాల సేకరణ
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో బిర్యానీ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తిన్న అనంతరం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు. తాము పిస్తా హౌస్ నుంచి బిర్యానీ తీసుకెళ్లి తిన్న తర్వాతే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితులు ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, మంగళవారం ఇన్‌చార్జి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ. శరత్ ఆధ్వర్యంలో పిస్తా హౌస్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా రెస్టారెంట్ వంటశాల, పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానాలు, వంట సామగ్రి, ఆహార భద్రత ప్రమాణాల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రెండు ఆహార పదార్థాల చట్టబద్ధ నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ. శరత్ మాట్లాడుతూ, వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణకు ఫుడ్ సేఫ్టీ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రయోగశాల నివేదికలు వచ్చిన అనంతరం అందులో తేలిన ఫలితాల ఆధారంగా ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర ఆహార వ్యాపార సంస్థల్లో నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా ఫుడ్ సేఫ్టీ శాఖ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఆహార వ్యాపారులు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి విక్రయించాలని, నాణ్యమైన ముడి పదార్థాలనే వినియోగిస్తూ ఆహార భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వినియోగదారులు కూడా ఆహారం తీసుకునే సమయంలో పరిశుభ్రత, నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నాసిరకం, కలుషితమైన లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు సమాచారం అందించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story