- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్.. నీటిపారుదల శాఖ అధికారుల తీరుపై సుడా చైర్మన్ అసహనం
వైరా మండల నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు.

దిశ, వైరా: వైరా మండల నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుపై సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. మండల రైతాంగం సమక్షంలో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీను విస్మరిస్తారా...! అంటూ తన సన్నిహితుల వద్ద వాపోయారు. తాము వైరా రిజర్వాయర్ నుంచి రైతులకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఇప్పటికే గోదావరి జలాలను వైరాకు విడుదల చేయిస్తుంటే నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తమ పనులు చేయడం లేదంటూ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం దిశ వెబ్సైట్లో "ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్, పూడికతీత నీటి మూటేనా" అనే వార్త కథనం ప్రచురితమైంది. గత నెల 3 వ తేదీన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రైతుల సమావేశంలో వైరా రిజర్వాయర్ కుడి ఎడమ ప్రధాన కాలువల్లో పూడికతీత పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ ఈఈ బాబురావు స్పష్టం చేశారు. అయితే 5 రోజుల గడిచిన నేటి వరకు ఆ పనులు ప్రారంభం కాని విషయాన్ని దిశ బహిర్గతం చేసింది. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వార్తా కథనాన్ని చూసిన సుడా చైర్మన్ దుర్గాప్రసాద్ నీటిపారుదల శాఖ అధికారుల అలసత్వాన్ని ఆక్షేపించారు.
పూడికతీత పనులు పూర్తి చేయిస్తానని స్పష్టం...
పూడికతీతకు నగదు లేకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పినప్పటికీ అధికారులు ఎందుకు పనులు చేయటం లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా దిశ కథనంతో స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ త్వరితగతిన పూడికతీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడాలని నిశ్చయంతో ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, రైతులు అపోహ పడవద్దని ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పూడికతీత పనులు పూర్తిస్థాయిలో చేపించే బాధ్యత తనదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవసరమైతే ముందుగా నారుమళ్ళకు నీరు విడుదల చేసి ఆ తర్వాత అయినా పూడికతీత పనులు పూర్తి చేయిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు పూడికతీత పనులు చేపట్టకపోవటంపై ఆయకట్టు రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ బాబురావును దిశ వివరణ కోరగా రైతుల సమావేశం జరిగిన తరువాత పూడికతీత పనులు ప్రారంభించాలని జేఈకు తెలిపానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదనే విషయం తన దృష్టికి రాలేదని వివరించారు.






