- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారదర్శక పాలన అందించేందుకు కృషి చేయండి
"అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, ఖమ్మం రూరల్ : "అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సాయి గణేష్ నగర్ (రోడ్డు నంబర్ 8) లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
మంత్రి సంకల్పానికి తోడుగా..
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్గదర్శకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. "ఈ కార్యాలయం కేవలం నాలుగు గోడల మధ్య నడిచేది కాదు.. ఇది ప్రజల కష్టాలను పంచుకునే వేదిక కావాలి. చైర్‌పర్సన్ అనిత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి" అని ఆయన దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి సమస్యలను కూడా ఈ కార్యాలయం వేదికగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
అభివృద్ధిలో రాజీ పడం..
మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు, తనకు అండగా నిలిచిన మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






