సత్తుపల్లి మున్సిపాలిటీ: అన్నింటా అవినీతి..లొసుగులు!

by velandi.Saikiran |

సత్తుపల్లి మున్సిపాలిటీ: అన్నింటా అవినీతి..లొసుగులు!
X

అన్నింటా అవినీతి..లొసుగులు!

సత్తుపల్లి మున్సిపాలిటీలో

4 గంటల వరకు ఏసీబీ సోదాలు

కీలక పత్రాలు, సెల్‌ఫోన్‌లు సీజ్

పలువురు ఉద్యోగులు, బిల్ కలెక్టర్లకు

నోటీసులు ఇస్తామన్న ఏసీబీ డీఎస్పీ

సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి జరుగుతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్, ముగ్గురు ఎస్సైలు, 15మందితో కూడిన అధికారులు మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుధ్య విభాగంలో ముఖ్య అధికారులు, అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి సెల్‌ఫోన్లు, ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్‌లను క్షుణ్నంగా పరిశీలించారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగిన సోదాల్లో ఇంటి పన్నులు క్రమబద్ధీకరణలో లొసుగులు గుర్తించారు. ఆదాయ వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారించి, గత ఏడాది కాలంగా మున్సిపల్ లో జరిగిన ఖర్చులను పరిశీలించి, కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ ఉద్యోగులు, పలువురు బిల్ కలెక్టర్లకు నోటీసులు అందజేస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపాలిటీలో మంగళవారం మధ్యాహ్నం నుంచి కొనసాగిన ఏసీబీ సోదాలు బుధవారం తెల్లవారుజామున 4గంటల వరకు కొనసాగాయి. ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్సైలు, 15 మంది సిబ్బందితో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ సిబ్బంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుధ్య విభాగంలో ముఖ్య అధికారులు, అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి సెల్‌ఫోన్లు, ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత ట్రాన్సాక్షన్ నిర్వహించినట్లు గ్రహించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. బుధవారం నాలుగు గంటల వరకు కొనసాగిన సోదాల అనంతరం పలు డాక్యుమెంట్స్, సెల్ ఫోన్లు సీజ్ చేసి వారి వెంట తీసుకెళ్లారు.

భవన నిర్మాణ క్రమబద్ధీకరణలో..

సత్తుపల్లి మున్సిపాలిటీలో సుమారు 30నుంచి 50ఇంటి పన్నులు క్రమబద్ధీకరణలో రూ.కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ.. హైదరాబాద్లో నివాసం ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇంటి నిర్మాణం క్రమబద్ధీకరణ, ఇంటి పన్ను చెల్లింపుల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్, మేనేజర్‌ భారీ స్థాయిలో నగదు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఇలాగే ఓ వ్యక్తి తన ఇంటి పన్ను రూ 6.లక్షలు రావటంతో తగ్గించాలని బిల్ కలెక్టర్‌ను కోరగా మేనేజర్‌తో మాట్లాడి, హైదరాబాద్ వెళ్లి మున్సిపల్‌శాఖలో క్రమబద్ధీకరణకు ఆరు లక్షల ఉన్న పన్ను రూ.75వేలకు కుదించి మార్పు చేసినందుకు గాను రూ 2.లక్షలు ముడుపులు తీసుకున్నట్లు గుర్తించారు. ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ బిల్ కలెక్టర్.. ఫిర్యాదారుడు ఇంటికి వెళ్లి వారి వద్ద నుంచి సేకరించిన నగదు తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. బిల్ కలెక్టర్, మేనేజర్ ఏసీబీ సోదాల సమయంలో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అర్ధరాత్రి 12గంటల వరకు ఏసీబీ అధికారులు ఎదుట హాజరు కాలేదు.

మున్సిపల్ వ్యయంపై ప్రత్యేక దృష్టి

సత్తుపల్లి మున్సిపల్ లో గత పాలకవర్గం పాలన పూర్తయ్యే నాటికి సత్తుపల్లి నికర ఆదాయం రూ.12కోట్ల మేర ఉన్నా.. ప్రత్యేక పాలన కొనసాగిన ఏడాది కాలంలోనే ఇటీవల నూతన పాలకవర్గం కొలువుతీరిన సమయానికి మార్చి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మిగులు రూ.1.11కోట్లు ఉంది. మున్సిపల్ ఆదాయ వ్యయాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, గత ఏడాది కాలంగా మున్సిపల్ లో జరిగిన ఖర్చులను పరిశీలించి, కీలక పత్రాలలో స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

నోటీసులు అందజేశాం

ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్

మున్సిపల్ ఉద్యోగులకు, పలువురు బిల్ కలెక్టర్లకు నోటీసులు అందజేస్తాం. నోటీసులు అందినవారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.

Next Story