పొంగులేటిలో తగ్గిన జోష్... కారణం జగన్ వద్దని చెప్పాడా?

by Gopi |
పొంగులేటిలో తగ్గిన జోష్... కారణం జగన్ వద్దని చెప్పాడా?
X

దిశ, వైరా: "నూతన సంవత్సర సందర్భంగా జనవరి ఒకటో తేదీ నుంచి ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం వరకు బీఆర్ఎస్ నాయకులపై ఘాటుగా విమర్శలు చేసిన పొంగులేటి వ్యక్తిగత విమర్శలపై యూటర్న్ తీసుకున్నారా... బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలపై విమర్శల కంటే ప్రభుత్వ పథకాలలోని లోపాలను ఎత్తిచూపటమే శ్రేయష్కారం అనుకున్నారా... గత నెలన్నర రోజులుగా బీఆర్ఎస్ నేతలపై, ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై గొంతు పెకిలించి మరీ చాలెంజ్ లతో సవాళ్లు విసిరిన పొంగులేటి స్వరం మారిందా... ఆయన స్వరంలో వాడి వేడి తగ్గటానికి కారణమేంటి... ప్రభుత్వ పెద్దలపై విమర్శలు వద్దనుకున్నారా... లేదా తన ఆత్మబంధువైన జగన్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయొద్దని సలహా ఇచ్చారా" అనే అంశాలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

గత నెలన్నర రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై హాట్ కామెంట్లు చేసి ఒక్కసారిగా వైరా నియోజకవర్గ సమావేశంలో ఆయన జోష్ తగ్గటంపై పలు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన తర్వాత పొంగులేటి పినపాక, అశ్వారావుపేట, మధిర, ఇల్లందు నియోజకవర్గాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీపై విరుచుకపడ్డంత స్థాయిలో తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా వైరా నియోజకవర్గంలోనే తన అనుచరులు 20 మందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించటంతో కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే తనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని ఘాటుగా సవాల్ విసిరారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్, జిల్లా మంత్రి పువ్వాడపై కూడా ఆ సమావేశాల్లో వాడి వేడి విమర్శలు, కామెంట్లు చేశారు.

అయితే వైరాలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగం సాదాసీదాగా సాగటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తనకు రాజకీయంగా జిల్లాలోనే కేంద్ర బిందువు అయిన వైరాలో తన అనుచరులను బీఆర్ఎస్ నాయకులు బహిష్కరించటంపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం చర్చనీయాంసమైంది. కేవలం ఆయన ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే ప్రచారం జరుగుతుంది. లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలకు చెక్ పెట్టారా అనే ఆలోచనలు రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతున్నాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆత్మ బంధుమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తన ఆత్మబంధువు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలపై పొంగులేటితో క్షుణ్ణంగా చర్చించారని చర్చ జరుగుతుంది.

అయితే పొంగులేటి బీఆర్ఎస్ అధినాయకత్వంపై చేస్తున్న విమర్శలపై కూడా వారి మధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలపై కంటే కూడా ప్రభుత్వ పథకాలలోని లోపాలను ఎత్తిచూపితేనే శ్రీనివాసరెడ్డికి రాజకీయంగా లాభం జరుగుతుందని జగన్ ఏమైనా సలహా ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలోని నేతలను అదేపనిగా విమర్శలు చేయడం కూడా శ్రేయస్కరం కాదని జగన్ పొంగులేటి కి ఏమైనా సలహా ఇచ్చారా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. వైరాలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించే సమయానికి ముందు ఎమ్మెల్యే రాములు నాయక్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్యే పదవి ఎవరు పెట్టిన భిక్ష కాదని... నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఓట్లు వేసి తనను గెలిపించారని స్పష్టం చేశారు. డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కావని చెప్పారు. అంతేకాకుండా పొంగులేటిపై ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. దీంతో పొంగులేటి వ్యక్తిగత విమర్శలు జోలికి వైరా సభలో వెళ్లలేలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలు చేసేవారికి కౌంటర్ కు కౌంటర్ ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుండాన్ని పొంగులేటి ఇబ్బందికరంగా భావించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా గతానికి భిన్నంగా వైరాలో ప్రసంగించిన పొంగులేటిలో జోష్ మాత్రం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read...

తెలంగాణలో కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు: తేల్చి చెప్పిన Manik Thakre

Next Story