రవాణా శాఖ మంత్రి సొంత ఇలాకాలోని రవాణా ఆఫీసులోనే అవి లేవంటా!

by Dishanational1 |
రవాణా శాఖ మంత్రి సొంత ఇలాకాలోని రవాణా ఆఫీసులోనే అవి లేవంటా!
X

దిశ, వైరా: అది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సొంత ఇలాకా... మంత్రి ఇలాకాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఏడేళ్లు దాటినా ఈ సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారు. జిల్లా అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు మంత్రి తన శాఖలోని చిన్న సమస్యను పరిష్కరించలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఈ సమస్య జిల్లాలో ఉందనే విషయం మంత్రి దృష్టిలో ఉందో లేదో కూడా తెలియదు. రవాణా శాఖలోని వైరా, సత్తుపల్లి యూనిట్ కార్యాలయాల్లో కార్డుల ప్రింటింగ్ మిషన్లు లేక వాహనదారులు, లైసెన్స్ లు తీసుకునే డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా శాఖ మంత్రి సొంత జిల్లాలోని యూనిట్ కార్యాలయాల్లో ఈ సమస్యను పరిష్కరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రింటింగ్ మిషన్లు లేకపోవడంతో వైరా, సత్తుపల్లి యూనిట్ కార్యాలయాల్లో లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కార్డుల కోసం ఖమ్మం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఖమ్మంలో ఖమ్మం, వైరా సత్తుపల్లి, యూనిట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న కార్డులు ప్రింట్ చేయాల్సి రావటంతో కార్డుల మంజూరీలో తీవ్ర జాప్యం ఏర్పడుతుంది.


వైరా సత్తుపల్లి యూనిట్ కార్యాలయాల పరిస్థితి ఇది

సత్తుపల్లిలోని ఎంవీఐ కార్యాలయాన్ని 1990 సంవత్సరంలోనే యూనిట్ కార్యాలయంగా అభివృద్ధి చేశారు. వైరాలోని ఎంవీఐ కార్యాలయాన్ని 2015 జూన్ రెండో తేదీన యూనిట్ కార్యాలయంగా అప్ గ్రేడ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా యూనిట్ కార్యాలయాల్లో కావాల్సిన వసతులను ఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేయలేదు. వైరాలో యూనిట్ కార్యాలయం ఏర్పడి ఏడేళ్లు గడిచినా నేటి వరకు కార్డుల ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేయలేదు. ఈ మిషన్ ఏర్పాటు చేయాలంటే ప్రత్యేకమైన గదితోపాటు తప్పనిసరిగా ఏసీ ఉండాలి. ఈ వసతులతో ప్రింటర్ను ఏర్పాటు చేసేందుకు నేటి వరకు రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా సత్తుపల్లిలో గత రెండేళ్ల క్రితం వరకు కార్డుల ప్రింటింగ్ మిషన్ ను నిర్వహించారు. అయితే ఆ మిషన్ చెడిపోవడంతో నేటివరకు దాని స్థానంలో నూతన మిషన్ ను ఏర్పాటు చేయలేదు. దీంతో సత్తుపల్లి, వైరా యూనిట్ కార్యాలయ పరిధిలోని ప్రజలు కార్డుల కోసం ఖమ్మం యూనిట్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. జిల్లాలోని మూడు యూనిట్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు, మంజూరు చేసిన లైసెన్సులకు ఖమ్మం కార్యాలయంలోనే కార్డులు ప్రింటింగ్ చేయాల్సి రావటంతో తీవ్ర జాప్యం నెలకొంటుంది. కార్డు మంజూరు కావాలంటే నెల నుంచి రెండు నెలలు పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్య చిన్నదే... మంత్రి తలుచుకుంటే నిమిషాల్లోపే పరిష్కారం

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఉన్న సమస్యలు చిన్నవి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తలచుకుంటే ఈ సమస్యలను నిమిషాల్లో పరిష్కారం చేయవచ్చని వాహన యజమానులు అంటున్నారు. సొంత శాఖలోని చిన్న సమస్యలను మంత్రి పరిష్కరించడానికి ఎంతో సమయం పట్టదని వారు వాపోతున్నారు. అయితే జిల్లాలోని యూనిట్ కార్యాలయాల్లో ప్రింటింగ్ మిషన్ ల సమస్య ఉందని ఇప్పటివరకు మంత్రి దృష్టికి వెళ్లిందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఈ సమస్య మంత్రి దృష్టికి వెళితే ఇన్ని రోజులు పరిష్కరించకుండా ఉండరనేది స్థానిక వాహన యజమానుల అభిప్రాయం కూడా ఉంది. లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ప్రభుత్వానికి పక్కాగా పన్నులు చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు వారు లైసెన్స్ కు అప్లై చేసి , వాహనాలు రిజిస్ట్రేషన్లు చేసే యూనిట్ కార్యాలయాల్లోనే కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రింటర్లు లేకపోవడం వల్ల కాలయాపనతోపాటు వాహన చోదకులు ఖమ్మం కార్యాలయం చుట్టూ కార్డుల కోసం చెప్పులు అరిగిపోయేలా ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వైరా, సత్తుపల్లి యూనిట్ కార్యాలయాలకు ప్రింటింగ్ మిషన్లతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించి జిల్లా ప్రజల మన్ననలను మరింత పొందాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed