- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యా.. నేను ఇంకా చావ లేదయ్యా.. నాకింకా ఊపిరి ఆడుతోంది!
కళ్ల ముందు నిలువెత్తు ప్రాణం... ఆ చేతిలో ఉన్న కాగితం మీద మాత్రం 'మరణ శాసనం'.

దిశ, దమ్మపేట: కళ్ల ముందు నిలువెత్తు ప్రాణం... ఆ చేతిలో ఉన్న కాగితం మీద మాత్రం 'మరణ శాసనం'. పండుటాకులా ఉన్న ఆ పెద్దాయన తన సొంత డెత్ సర్టిఫికెట్ పట్టుకుని, "బాబూ.. నేను బతికే ఉన్నాను కదా.. మీ కళ్లెదుటే నిలబడి మాట్లాడుతున్నాను కదా.. నేనెలా చచ్చిపోయినట్లు రాశారయ్యా" అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే... అక్కడున్న రాళ్లు కూడా కన్నీరు పెట్టాయి. దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మళ్ళా సత్యం అనే ఆ పండుటాకు పడుతున్న నరకం చూస్తుంటే ఏ మనిషికైనా గుండె తరుక్కుపోతుంది. మనిషికి మరణం ఒకసారే వస్తుంది.. కానీ తోటి మనుషుల రాక్షసత్వం ఆ వృద్ధుడిని బతికుండగానే పాడెక్కించింది, ప్రతిక్షణం చంపివేస్తోంది. ఒక మనిషి బతికి ఉండి కూడా, తన ఉనికిని తాను నిరూపించుకోవడానికి తన మరణ ధృవీకరణ పత్రాన్ని తానే పట్టుకుని అధికారుల కాళ్లవేళ్లు పడాల్సిన ఖర్మ ఈ దేశంలో దాపురించడం అత్యంత దారుణం.
ఐదెకరాల కోసం.. ఇంతటి అమానుషమా?
డబ్బు మీద ఆశ ఉండొచ్చు, భూమి మీద వ్యామోహం ఉండొచ్చు. కానీ ఒక ఐదెకరాల మట్టి కోసం ఇంతలా దిగజారిపోతారా? ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా కాగితాల్లో రాసుకోవడం చూశాం.. కానీ నాడి కొట్టుకుంటున్న మనిషి ఊపిరి ఆగిపోయిందని డెత్ సర్టిఫికెట్ పుట్టించడం బహుశా ఈ కసాయి భూమాఫియాకే చెల్లింది. కాటికెళ్లే వయసులో కాసింత గంజి తాగి బతుకుదామనుకున్న ఆ పెద్దాయన మెడకు ఆన్‌లైన్ ఉరితాడు వేశారు. పండు వయసులో ఆసరాగా నిలవాల్సిన సమాజమే, ఆ పెద్దాయన బతుకును కాగితాల్లో సమాధి చేసేసింది.
నాకు ఆకలేస్తుందయ్యా.. నన్నెవరు సాకుతారు?
ఆ ముడతలు పడిన ముఖంలో ఆవేదన, ఆ కళ్ళలో కారే కన్నీళ్లు చూస్తుంటే పేగులు తెగిపోతున్నాయి. "నా భూమి లాక్కుని నన్ను అనాథను చేశారు. బతికున్న నన్ను కాగితాల్లో చంపేసి.. నాకు ఆసరాగా వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేశారు. నాకిప్పుడు ఏ దిక్కూ లేదు.. ఆకలేస్తుందయ్యా.. ఈ ముసలి వయసులో ఏ పనీ చేయలేను.. నన్ను ఎవరు సాకుతారయ్యా?" అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతూ ఆయన వేడుకుంటున్న దృశ్యం చూసి అక్కడున్న వాళ్లందరి కళ్లూ చెమర్చాయి. బరువెక్కిన ఆ గాలిలో ఆయన ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. కాగితాల మీద సంతకాలు ఫోర్జరీ చేశారు, రికార్డుల్లో పేర్లు మార్చేశారు సరే.. ఆ పెద్దాయనలోని జీవాన్ని ఎలా మార్చగలరు? భూకబ్జాల కోసం ఇంతటి అమానుషానికి తెగబడిన వారిని చూస్తుంటే అసలు ఈ సమాజంలో మానవత్వం బతికుందా అన్న సందేహం కలుగుతోంది. మళ్ళా సత్యం చేతిలో ఉన్నది కేవలం ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రం కాదు.. అది డబ్బుకు దాసోహం అంటున్న మన వ్యవస్థకు, చచ్చిపోతున్న మన మానవత్వానికి సజీవ సాక్ష్యం. ఆ పెద్దాయనకు న్యాయం జరగాలి.. ఆ వృద్ధుడి కన్నీళ్లు తుడిచే బాధ్యత ఈ సమాజం తీసుకోవాలి. లేదంటే రేపు ఏ బతికున్న మనిషికైనా ఈ ప్రభుత్వ రికార్డులు ఉరితాడు వేస్తాయి!






