లారీ ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం..

by Kodari Anjali |

లారీ కారును ఢీకొట్టిన ఘటనలో ఒక సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.​

లారీ ఢీకొని సింగరేణి కార్మికుడు దుర్మరణం..
X

దిశ, బూర్గంపాడు/మణుగూరు: కొత్తగూడెం పరిధిలోని ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక లారీ కారును ఢీకొట్టిన ఈ ఘటనలో ఒక సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.​ మృతుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని రాజుపేటకు చెందిన ఉపేందర్‌గా గుర్తించారు. ఆయన భూపాలపల్లి సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. రాత్రివేళ ఉపేందర్ తన కారులో భూపాలపల్లి నుండి మణుగూరులోని తన ఇంటికి బయలుదేరారు. ​ఈ క్రమంలో కారు కొత్తగూడెం-ఇల్లందు క్రాస్ రోడ్ సమీపానికి చేరుకోగానే, కారు వెనుక భాగం నుండి ఏదో శబ్దం రావడం ఉపేందర్ గమనించారు. ఏం జరిగిందోనని కారును రోడ్డు పక్కన ఆపి, వెనుక భాగాన్ని పరిశీలిస్తుండగా.. అదే సమయంలో వెనుక నుండి అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ ఆయనను, కారును బలంగా ఢీకొట్టింది.

​అక్కడికక్కడే మృతి...

​లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఉపేందర్ తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ​ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సింగరేణి కార్మికుడి అకాల మరణంతో ఆయన స్వగ్రామమైన మణుగూరు రాజుపేటలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story