- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి అడుగులు
సింగరేణిని బహుముఖ సంస్థగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి పరిశీలిస్తోంది.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణిని బహుముఖ సంస్థగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి పరిశీలిస్తోంది. ఈ మేరకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్‌తో సమావేశమై ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటుపై అధ్యయనం పూర్తయిందని, పెట్టుబడిపై రాబడి మెరుగుపరిచేందుకు ప్లాంట్ సామర్థ్యం పెంపు, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, స్వదేశీ సాంకేతికత వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. అలాగే తాల్చేర్, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్, జేఎస్పీఎల్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు ఈ నెలలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనుంది. భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అవకాశాలపై కూడా సాంకేతిక-ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లో ఐదు బ్లాక్‌లను గుర్తించగా, తొలి పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో చేపట్టేందుకు డ్రిల్లింగ్ పనులకు సన్నాహాలు జరుగుతున్నట్లు సీఎండీ వెల్లడించారు. సీఎంఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.






