బూర్గంపాడులో అక్రమ ఇసుక లారీ పట్టివేత

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు.

బూర్గంపాడులో అక్రమ ఇసుక లారీ పట్టివేత
X

దిశ‌, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సోమవారం మండల పరిధిలోని మోరంపల్లి బంజార గ్రామంలో గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ​గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఈ క్రమంలో బూర్గంపాడు పోలీసులు పక్కా ప్రణాళికతో చెక్ పోస్ట్ వద్ద మాటు వేశారు. సోమవారం ఇసుకతో వెళ్తున్న టీఎస్ 04 యూఏ 6739 లారీని ఆపి తనిఖీ చేయగా.. దానికి సంబంధించిన ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఇసుక తరలింపు సూత్రధారులను శిక్షించాలని,​ కేవలం వాహనాలను పట్టుకుని వదిలేయడం కాకుండా, ఈ ఇసుక మాఫియా వెనుక ఉన్న అసలు అక్రమార్కులను గుర్తించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి,యజమానులపై కఠినమైన కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. పోలీసుల తీరుపై ఉత్కంఠ ప్రస్తుతం పట్టుబడిన లారీ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది మండలంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రాజకీయ నాయకుల నుండి ఒత్తిళ్లు రావడం సహజం. పోలీసులు నిబంధనల ప్రకారం.. కేసు నమోదు చేసి తమ నిజాయితీని చాటుకుంటారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాహనాన్ని విడిచిపెడతారా? అనేది వేచి చూడాలి.

Next Story