సీతమ్మ పింఛన్.. మూడేళ్లు స్వాహా!

by Kodari Anjali |

తనగంపాడులో అక్రమ పింఛన్ వెలుగులోకి వచ్చింది.

సీతమ్మ పింఛన్.. మూడేళ్లు స్వాహా!
X

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు గ్రామానికి చెందిన పీట్ల సీతమ్మ పేరుపై 2023లో ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేసింది. అయితే, ఆమెకు అందాల్సిన పింఛన్ సొమ్ము గత మూడేళ్లుగా ఆమె బ్యాంకు ఖాతాలో కాకుండా మరొకరి బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పింఛన్ లబ్ధిదారుల అర్హతల ధృవీకరణ (వెరిఫికేషన్) సందర్భంగా ఈ విషయం బయటపడింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను ఆశ్రయించగా, విచారణలో సీతమ్మ పేరుపై మంజూరైన పింఛన్ మరొకరి ఖాతాకు జమ అయినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గత మూడేళ్లుగా పింఛన్ అందడం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెరిఫికేషన్ సమయంలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, పింఛన్ నగదు మరొకరి ఖాతాలోకి ఎలా వెళ్లిందనే అంశంపై బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ఇప్పటివరకు సీతమ్మకు అందని మొత్తం పింఛన్ బకాయిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

నాకు న్యాయం చేయండి.. బాధితురాలు పీ.సీతమ్మ

నాకు తెలియకుండానే గత మూడు ఏళ్లుగా పింఛన్ వస్తుందన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. దయచేసి అధికారులు నాకు పింఛన్లు వచ్చే విధంగా న్యాయం చేయాలని వేడుకుంటున్నా.

విచారణ చేసి చర్యలు తీసుకుంటా.. రూరల్ ఎంపీడీవో రవికుమార్

గత 3 ఏళ్లుగా పింఛన్ వేరే ఖాతాలో పడటం నాకు కూడా తెలిసింది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్టి సొమ్మును రికవరీ చేయడంతో పాటు ఫ్రీజ్ చేస్తాం. సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తప్పవు.

Next Story