తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై కేసు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని జీరో ఎఫ్ఐఆర్

by Ramesh Naini |   (  Updated:2026-07-06 07:22:51  IST  )

జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదైంది.

తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్యపై కేసు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని జీరో ఎఫ్ఐఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదైంది. కేవీఆర్ అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఏపీ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీసులకు బదిలీ చేస్తూ సమాచారం అందించారు.

డీఎస్పీ గోవిందరావు తెలిపిన వివరాలు ఇలా!

ఆదివారం డీఎస్పీ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాడంగి మండలానికి చెందిన మాజీ సర్పంచ్‌ చేసిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీసులు గత నెల 30న జర్నలిస్ట్ కేవీఆర్‌ను అరెస్టు చేసేందుకు సరూర్‌నగర్‌కు వెళ్లారు. అక్కడ అతని భార్య విజయలక్ష్మి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. దీంతో బొబ్బిలి సీఐ శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు ఆమెపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సరూర్‌నగర్‌ పోలీసులకు రిఫర్‌ చేశారు. విజయలక్ష్మి కూడా సీఐ శ్రీనివాస్‌పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై సరూర్‌నగర్‌లో కేసు నమోదైందని డీఎస్పీ వెల్లడించారు.

అసలు ఏం జరిగిందంటే..?

ఆరు రోజుల క్రితం హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని నివాసంలో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్‌ను బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన భార్య విజయలక్ష్మి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. అయితే, ఆ అరెస్ట్ సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ తనను గట్టిగా పట్టుకుని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ విజయలక్ష్మి సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌పై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏపీ పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.

సీఐపై బదిలీ వేటు..

మరోవైపు, కేవీఆర్ భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో బొబ్బిలి రూరల్‌ సీఐ శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆయనను విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story