- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుకాసురుల ఆగడాలు ఆగేనా?
టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. స్థానికంగా ఉన్న వాగుల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు.

టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. స్థానికంగా ఉన్న వాగుల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా పంట పొలాల మీదుగా ఇసుక ట్రాక్టర్లను తోలుతూ భూములను ధ్వంసం చేసున్నారు. పలు గ్రామాల్లో ఇసుక రవాణా చేయకుండా గ్రామస్తులు, అధికారులు అడ్డుకుంటే వారిపై తిరగబడుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అధికారిణి అడ్డుకుని, కొత్తగూడెం రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు యత్నించగా ఇసుక మాఫియా ట్రాక్టర్ గుద్ది చంపుతామంటూ బెదిరించి ట్రాక్టర్ తీసుకుని పరారయ్యారు. సంపత్‌నగర్ గ్రామ సమీపంలోని పాలవాగు నుంచి అక్రమ ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ట్రాక్టర్ యజమానులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇసుక మాఫియాకు కొందరు అధికార పార్టీ నాయకుల అండ ఉందని, వారిని చూసుకుని చెలరేగిపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగానే ఇసుక దందా నడుస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. - దిశ, టేకులపల్లి
దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని, అడ్డుకున్నా వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక తరలిస్తూ పంటలను సైతం ధ్వంసం చేస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల అండతో ఇసుకమాఫియా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను టేకులపల్లి మండలంలోని శంభునిగూడెం, సంపత్‌నగర్, చంద్రుతండా గ్రామస్తులు అడ్డుకున్నా... ఇసుకాసురుల ఆగడాలు ఆగడం లేదు. పైగా ఓ ఫారెస్ట్ అధికారిణిపై దాడికి యత్నించి సవాల్ విసిరారు. ఇటీవలే టేకులపల్లి మండలంలోని సంపత్‌నగర్ గ్రామ సమీపంలోని పాలవాగు నుంచి అక్రమ ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో ట్రాక్టర్ యజమానులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై బోడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఫారెస్ట్ అధికారిణిపై బెదిరింపులు
టేకుపల్లి మండలం బొమ్మనపల్లి సెక్షన్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీవో) గూగులోత్ దేవి సిబ్బందితో కొండగులబోడు సమీపంలోని ఫారెస్ట్ ఏరియా నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆపారు. డ్రైవర్ వద్ద ఎటువంటి కాగితాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను కొత్తగూడెం రేంజ్ తరలించాలని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చెప్పడంతో ట్రాక్టర్ తరలింపునకు సిబ్బంది యత్నించగా బీట్ ఆఫీసర్‌పై దాడి యత్నించారు. ‘ట్రాక్టర్‌తో గుద్ది చంపుతా’ అంటూ బెదిరించి ట్రాక్టర్ తీసుకెళ్లారు. దీనిపై ఫారెస్ట్ అధికారి ఫిర్యాదుతో టేకులపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
పంట భూములు ధ్వంసం
మండలంలోని పలు గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ప్రతీరోజూ ఇసుకను వాగులో లోడ్ చేసుకుని రైతులు సాగు చేస్తున్న భూములపై వెళ్తుండటంతో భూములు ధ్వంసం అవుతున్నాయని వాపోతున్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా, ఫారెస్టు, రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు చిగురుపాటి రత్నకుమార్ వాపోయారు. ఇటీవల అర్ధరాత్రి ట్రాక్టర్లను అడ్డుకున్నా పారిపోయారని, నాలుగు ట్రాక్టర్లను బోడు పోలీసులకు అప్పగించినా ఇసుక రవాణాకు అడ్డుకట్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఇసుక దందా నడుస్తున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అలకుంట రాజేందర్, టేకులపల్లి ఎస్సై,
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తున్నాం. ఫిర్యాదులు రాగానే స్పందిస్తున్నాం.






