కాలువే కదా కలిపేసుకుందాం.. కబ్జా కోరల్లో సాగర్ కాలువలు

by Kodari Anjali |

రైతులకు సాగునీరు అందించే మేజర్, మైనర్ కాలువలు కబ్జా గురవుతున్నాయి.

కాలువే కదా కలిపేసుకుందాం.. కబ్జా కోరల్లో సాగర్ కాలువలు
X

కొణిజర్ల మండలంలో ప్రధానంగా 80శాతం మంది రైతులకు సాగు నీరందించేది సాగర్ కాలువలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కొంతమంది రైతులు కాలువలను ఆక్రమించుకోవడంతో సాగు నీరందక రైతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. మేజర్, మైనర్లు కబ్జాకు గురికాగా పంట కాలువలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఫలితంగా చివరి ఆయకట్టు భూములకు నీరు అందడం లేదు. ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని, తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించకుండా తహసీల్దారుకు, పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాల్సిన ఏఈలు వారానికో పది రోజులకో వచ్చి వెళ్తుతుంటారని, కొణిజర్లకు డీఈ స్థాయి అధికారి ఉన్నా కార్యాలయానికే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దిశ, కొణిజర్ల

దిశ, కొణిజర్ల: రైతులకు సాగునీరు అందించే మేజర్, మైనర్ కాలువలు కబ్జా గురవుతున్నాయి. దురాశతో కొంతమంది రైతులు కాలువలను ఆక్రమించుకోవటంతో సాగు నీరందక రైతుల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మేజర్, మైనర్లు కబ్జాకు గురికాగా పంట కాలువలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఫలితంగా చివరి ఆయకట్టుదారులకు సాగు నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంటుంది. ఏ మేజరు పరిధిలోనూ ఆయకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బీబీసీ) పరిధిలో 6సాగర్ మొయిన్ కెనాల్ పరిధిలో 11మేజర్లు ఉన్నాయి. మండలంలో ప్రధానంగా 80శాతం మంది రైతులకు సాగు నీరందించేది సాగర్ కాలువలే. వేల ఎకరాలకు సాగు నీరందించే మేజర్లు సైతం ఆక్రమణ గురవుతుంటే పట్టించుకునే వారే లేకపోవడం విశేషం. ఇక మైనర్లు పరిస్థితి దారుణం అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొంతమంది రైతులు సిమెంట్ పైపులు వేయడంతో కాలువ వెడల్పు లోతు తగ్గి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందని పరిస్థితి నెలకొంది. పంట కాలవల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాలువల ఆనవాళ్లే లేకుండా చదును చేసి చక్కగా వారి వారి భూముల్లో కలుపుకుంటున్నారు. కాలువలను ఆక్రమణకు గురికావటంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందక రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని, తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించకుండా తాము ఏమి చేయలేమని తహసీల్దారుకు, పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరచూ ఘర్షణలు..

మల్లుపల్లి (సీతరామయ్య బంజర) మేజరు విషయంలో రెండు వర్గాల రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేజరుకు సంబంధించిన మ్యాప్ తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరించారు. మ్యాప్ లేకుండా ఘటనా స్థలానికి వెళ్లిన ఇరిగేషన్ అధికారులు అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు అంటూ చెప్పటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం చేశారు. సంబధిత శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేసే వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఇరిగేషన్ అధికారుల పని తీరును అర్థం చేసుకోవచ్చు.

పెద్దగా ప్రయోజనం లేదని...

ఖమ్మం వైరా హైవే పక్కన వైరా మేజరు కట్టను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తిగా తవ్వి ఆక్రమించి దర్జాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నిత్యం జిల్లా స్థాయి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు నిత్యం పర్యటించే రహదారి పక్కనే కాలువ కట్ట ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లెనా లేకపోవడం విశేషం. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాల్సిన ఏఈలు వారానికో పది రోజులకో వచ్చి వెళ్తుతుంటారని రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత మేజర్ల ఏఈలు క్షేత్రస్థాయిలో కాలువలపై పర్యటిస్తే సమస్యలపై అవగాహన ఉండటంతో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే అవకాశం కలుగుతుందని, ఏఈలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని చెబుతున్నారు. కొణిజర్లకు డీఈ స్థాయి అధికారి ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం కొణిజర్లలో.. కార్యాలయం ఖమ్మం నగరంలో ఉండటంతో కార్యాలయానికే పరిమితం అవుతున్నట్లు సమాచారం. తమ శాఖకు సంబంధించిన సమస్యలను తాము రిష్కరించకుండా రెవెన్యూ పోలీస్ శాఖలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి. అధికారులు మేజర్లపై పర్యటించి అక్రమణలను తొలగించి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అదే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆక్రమణలకు రైతులే బాధ్యులు: డీఈ గౌతమి శిల్పా

కాలువల ఆక్రమణలకు రైతులే బాధ్యులు. బోర్లు ఉన్న రైతులకు సాగర్ నీళ్లతో అవసరం లేకపోవటంతో కాలువలు నిరుపయోగంగా ఉండటంతో ఆక్రమణలకు గురౌతున్నాయి. తన దగ్గరకు వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నాం.

Next Story