46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఉమ్మడి జిల్లాలో రెడ్ అలెర్ట్

by Ajay Maddhiboyina |

ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో వాతావరణశాఖ అధికారులు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఉమ్మడి జిల్లాలో రెడ్ అలెర్ట్
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో వాతావరణశాఖ అధికారులు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం నుంచే విపరీతమైన ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాత్రి 9గంటలు దాటినా వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గక పోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. గురువారం నమోదైన ఉష్ణోగ్రతల్లో 22మండలాల్లో 46డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాల్లో 45డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాతావరణ శాఖ అధికారులు జిల్లాలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు. గురువారం జిల్లాలోని సత్తుపల్లి వైరా కల్లూరులో అత్యధికంగా 46.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఏన్కూరు, మధిర, కొణిజర్ల, బోనకల్, చింతకాని తదితర మండలాల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తిరుమలాయపాలెం, ముదిగొండ, పెనుబల్లి, ఖమ్మం అర్బన్, ఎర్రుపాలెం మండలాల్లో 46 డిగ్రీలు, మిగిలిన మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయింది.

పెరుగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

: గరిష్టంగా 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రత ఉండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 26 నుండి 28 డిగ్రీల వరకు ఉండేవి. అయితే ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో వాతావరణంలో తేమ శాతం తక్కువై విపరీతమైన వేడి వస్తున్నది. దీంతోపాటు వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని వైరాలో గరిష్ట ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీలు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి ఏసీలు,కూలర్లు సైతం పనిచేయని పరిస్థితి ఏర్పడింది.

19గ్రామాల్లో రెడ్ అలర్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 గ్రామాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్క్‌ను దాటడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుయ్యారు. గురువారం చుంచుపల్లి మండలపరిధిలోని జీఎం ఆఫీస్, 3 ఇంక్లైన్ ప్రాంతంలో అత్యధికంగా 46.4 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది.

వైద్యుల హెచ్చరిక

వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం లేకుండా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని, ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. తేలికపాటి దుస్తులు ధరించడం, చిన్నారులను ఎండలోకి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

వాతావరణ శాఖ సూచనలు

రాబోయే రెండు మూడు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. రైతులు, కూలీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రెడ్ వార్నింగ్ ఏరియాలకు మెస్సేజ్‌లు

అత్యధిక ఉష్ణోగ్రతలునమోదు అవుతున్న ప్రాంతాలలో నివసించే ప్రజలను హెచ్చరిస్తూ, తెలంగాణా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రజలకు నేరుగా మెస్సేజ్ లు పంపుతున్నారు. ఈరోజు మీ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతనమోదు అవుతుంది. అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తూ అలెర్ట్ చేస్తున్నారు.

Next Story