వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి...

by Taduka Kalyani |

ఆరోగ్య సేవల నాణ్యత పెంపు, మాతా - శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ అన్నారు.

వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి...
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: ఆరోగ్య సేవల నాణ్యత పెంపు, మాతా - శిశు ఆరోగ్యం, సాధారణ ప్రసవాలు, వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తుకారాం రాథోడ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం ప్రతి వైద్య అధికారి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజల ఆరోగ్య సూచికలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన గర్భధారణ పూర్వ సేవలు అందించాలని, అధిక ప్రమాద గర్భిణీలను గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేయాలని, సాధారణ ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి జననం తర్వాత వెంటనే తల్లిపాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించాలన్నారు. రక్తహీనత నివారణకు చర్యలు చేపట్టాలని, సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, జీవనశైలి వ్యాధులు అయిన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం నియంత్రణకు స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలని, క్షయవ్యాధి, కుష్ఠు వ్యాధి, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించి దోమల నివారణ చర్యలను కట్టుదిట్టం చేయాలని, యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, హెచ్పీవీ టీకా, పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా వైద్య అధికారులు తమ పరిధిలోని గ్రామాలను తరచుగా సందర్శించి ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి సిబ్బంది తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భర్తీపై ప్రణాళికను తయారు చేయుట కొరకు గతంలో జనరల్ ట్రాన్స్ఫర్లలో సబ్ సెంటర్లు ఇవ్వని 54 మంది ఏఎన్ఎంలకు ఈనెల 18వ తారీకున కమిషనర్ ఆదేశానుసారం డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆఫీస్, కొత్తగూడెంలో కౌన్సిలింగ్ నిర్వహించబడును అని తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు శ్రీధర్, సాయి కళ్యాణ్, ప్రసాద్ ప్రోగ్రాం, ప్రతాప్ , రాందాస్ , రాకేష్ , దినేష్, హరీష్, ఎం ఎల్ హెచ్ పీ లు , యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Next Story