పంట బోనస్​ ఎగనామం పెట్టేందుకు కుట్రలు: హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ ​రావు ఆరోపించారు.

పంట బోనస్​ ఎగనామం పెట్టేందుకు కుట్రలు: హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్ ​రావు ఆరోపించారు. బోనస్ ఎగవేత, రైతన్నకు వాతలు పెట్టేందుకే వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఏ రకం ధాన్యం వేయాలని సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనన్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ అని తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేసి ప్రస్తుతం ఏడు రకాలకు తగ్గించారని మండిపడ్డారు. గత మూడు సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగికి రెండు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుంది. 45 రోజుల్లో ఇస్తామని సిద్దిపేట వేదికగా సీఎం చెప్పి 85 రోజులు దాటింది. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకే దిక్కులేకుండా పోయింది. మాటలు కోటలు దాటితే సీఎం చేతలు గడప దాటదు అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు.

పంట మార్పిడి అంటూ గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మి గత సీజన్లో మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, సోయా, వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరా చేయలేక యాప్ తెచ్చిన ప్రభుత్వం అందులోనూ విఫలం అయింది. సీజన్ కు ఒకరకంగా వ్యవహరిస్తూ రైతులను ఎందుకు గందరగోళం చేస్తున్నారని నిలదీశారు. కరువు ఉందని చెబుతున్న ప్రభుత్వం పంటల బీమా పథకం గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇప్పటికైనా మొక్కుబడి సమీక్షలు చేయడం ఆపేసి, రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధి చూపాలని, ప్రచార యావను తగ్గించి, రైతు సంక్షేమం గురించి దృష్టి పెట్టాలన్నారు. ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు అన్ని రకాల పంటలకు పంట బోనస్ చెల్లించాలని, గత యాసంగి, ఈ యాసంగి పంటలకు పెండింగ్ పెట్టిన బోనస్ డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

Next Story