సాగులో ఉన్నవారికే భూమి పట్టాలు

by velandi.Saikiran |

సాగులో ఉన్నవారికే భూ పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

సాగులో ఉన్నవారికే భూమి పట్టాలు
X

దిశ, ఖమ్మం బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, సాగులో ఉన్నవారికే భూ పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రజా దర్భార్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఆలోచన చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ విజయవంతం కావడమే నిదర్శనం అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తి కాబోతోందని వెల్లడించారు.

24వేల దరఖాస్తులు

పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా వర్గీకరించి, గత 25 నుంచి 30 రోజులుగా ‘ప్రజల వద్దకే ప్రభుత్వం’ అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. సోమవారంతో ఆఖరి విభాగం పూర్తయిందని, ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు 25వేల మంది ప్రజలను తాను వ్యక్తిగతంగా కలిసి, వారి సమస్యలను స్వయంగా కళ్లారా చూసి, చెవులారా విన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి మొత్తం 24వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయన్నారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11,000 అర్జీలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు అందినట్లు వివరించారు. అలాగే గృహజ్యోతి పథకం దరఖాస్తులతో పాటు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు వంటి స్థానిక సమస్యలపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున వినతులు సమర్పించారని చెప్పారు.

సాదాబైనామాల పరిష్కారం

గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చే ముందు సాదాబైనామాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో చేర్చకుండా రైతులను గాలికి వదిలేసిందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9,26,000 సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి మండలి నిబంధనలను సవరించిందని తెలిపారు. గతంలో భూమి అమ్మిన వారి సమ్మతి కూ డా కావాలనే నిబంధన ఉండేదని, కానీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అమ్మిన వారి సమ్మతి అవసరం లేకుండా నిబంధనలు మార్చామన్నారు. ఇప్పటికే ఐదున్నర లక్షల దరఖాస్తులను గుర్తించి నోటీ సులు ఇచ్చామని, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని, చట్టప్రకారం 30 రోజుల నోటీసు గడువు తర్వాత అర్హులైన అన్ని సాదాబైనామాలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

సాగు భూమికే పట్టాలు

తరతరాలుగా భూమి సాగులో ఉన్నా పట్టా పు స్తకాలు రావట్లేదని ఆవేదన చెందుతున్న రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి ఆధునిక భూ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో ని తిరుమలాయపాలెం గ్రామంలో ఇప్పటికే ఈ సర్వే విజయవంతంగా పూర్తయింద న్నారు. క్షేత్రస్థాయిలో సాగులో ఉన్న వారికే పట్టా పు స్తకాలు ఇస్తూ, లేనివారివి రద్దుచేసే చట్టాన్ని తెచ్చామని, ప్రజా దర్బార్‌లో వచ్చిన 4,300భూ సమస్యల దరఖాస్తుల్లో 2,300 అప్లికేషన్లను ప్రత్యేక కార్యాచరణ ద్వారా త్వరలోనే పరిష్కరించబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం కొంత భూమి సేక రిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టే పాత విధానాన్ని సవరించి, పట్టా భూములను ఆ నిషే ధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తైందన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి అధికారుల యంత్రాంగాన్ని విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కనీసం 45 రోజుల సమయం పడుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారి దరఖాస్తులను విడతలవారీగా అందజేస్తామని, అలాగే ఇళ్ల స్థలాల కోసం 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించామని, ఎక్కడైతే నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని సేకరించి రాబోయే కొద్ది రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చివరగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, పదేళ్లు దొరపాలన సాగించిన మాజీ మంత్రులు రాజకీయ దురుద్దేశంతో, స్వలాభం కోసం ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని, వారి మాటల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో ప్రజలకు ఉపయోగపడే న్యాయమైన అంశాలు ఉంటే పంతాలకు పోకుండా సానుకూలంగా తీసుకుని తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

Next Story