- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగ్జిబిషన్ అనుమతుల పై రాజకీయ ఒత్తిడిలు.. అధికారులు చిక్కుముడి
ఇల్లెందు పట్టణంలో ప్రతిపాదిత ఎగ్జిబిషన్ ఏర్పాట్ల చుట్టూ వివాదం ముదురుతోంది.

దిశ, ఇల్లెందు : ఇల్లెందు పట్టణంలో ప్రతిపాదిత ఎగ్జిబిషన్ ఏర్పాట్ల చుట్టూ వివాదం ముదురుతోంది. సరైన అనుమతులు లేకుండానే ఏర్పాట్లు పూర్తికి చేరుకున్నప్పటికీ, అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిడులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏమైనా చేసి అనుమతులు ఇవ్వాలి అంటూ కొందరు ప్రజాప్రతినిధులు అధికారులను ఒత్తిడి చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా ఎగ్జిబిషన్ స్థల ఎంపిక పై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బంక్, గ్యాస్ గోదాం, పాఠశాల సమీపంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రమాద సూచనలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వంటి అనుకోని ఘటనలు చోటుచేసుకుంటే భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య అధికారులు తర్జనభర్జనలో ఉన్నట్టు సమాచారం. ఒకవైపు ప్రజల భద్రత, మరోవైపు రాజకీయ ఒత్తిడులు ఈ రెండింటి మధ్య వారు ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే బాధ్యత తమ పై పడుతుందనే భయం కూడా వారిలో ఉంది. ఇటీవల ‘దిశ’లో ప్రచురితమైన కథనం తర్వాత పరిస్థితి కొంత మారినట్టు తెలుస్తోంది. ఆ కథనం అధికారుల్లో చర్చకు దారి తీసి, ఫైళ్లను మళ్లీ పరిశీలించే దిశగా చర్యలు ప్రారంభమైనట్టు సమాచారం. సంబంధిత శాఖల నుంచి ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ అనుమతులు, పోలీస్ క్లియరెన్స్ వంటి అంశాలను పునఃసమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల ప్రాణ భద్రతను పణంగా పెట్టి ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వాలా.. లేక నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలా అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక ప్రజలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు “అన్ని అనుమతులు, భద్రతా ప్రమాణాలు పూర్తి అయితేనే ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వాలి. లేదంటే కఠినంగా నిలవాలి” అని. ఇప్పటికైనా అధికారులు ఒత్తిడులకు లోనుకాకుండా, ప్రజల ప్రాణ భద్రతను ముందుంచి నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.






