పర్యవేక్షణేది..? నగరంలో అభివృద్ధి పనులు తనిఖీ చేయని అధికారులు!

by Ramesh Naini |   (  Updated:2026-01-22 03:07:07  IST  )

ఖమ్మం నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులపై వాస్తవంగా ఇంజినీరింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి. అయితే తమ వాటా తమకు ముట్టడంతో ఎవరు తనిఖీ చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పర్యవేక్షణేది..? నగరంలో అభివృద్ధి పనులు తనిఖీ చేయని అధికారులు!
X

దిశ. ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగరంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులపై వాస్తవంగా ఇంజినీరింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలి. అయితే తమ వాటా తమకు ముట్టడంతో ఎవరు తనిఖీ చేయడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ సైతం పనుల వద్ద ఉండకుండా సూపర్‌వైజర్లను ఉంచడంతో పనులు నాసిరకంగా చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

మంత్రి తుమ్మల చొరవతో..

ఖమ్మం కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖమ్మం కార్పొరేషన్ కు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేయించారు. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు పై దృష్టి పెట్టారు. అయితే తుమ్మల ఆశయాలకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్లు, అధికారులు పనిచేయడంతో నగరంలో నాసిరకపు నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలు తుంగలో తొక్కి..

ప్రస్తుతం నగరంలో సుమారు రూ. 60 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే సదరు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తాము పని చేయక బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి తమ వాటా తీసుకుంటున్నారు. దీంతో బినామీలు ఇష్టారాజ్యంగా పనులు చేసి కార్పొరేషన్ నిధులను కొల్లగొడుతున్నారు. అయితే ఇదంతా ఇంజినీరింగ్ అధికారులకు తెలిసినా తమకు ఎంత వాటా వస్తుందనే ఆలోచనే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎంబీ రికార్డులు కూడా చేయరు..

వాస్తవంగా పనులు జరిగేటప్పుడు కొలతలు, మందం (ఎంబీ) రికార్డులు చేయాలి. అంతేకాకుండా కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇవేవీ లేకుండానే ఇంజినీరింగ్ అధికారులు పనులను అప్రూవ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. పనులు చేయవలసిన కాంట్రాక్టర్లు బినామీలకి అప్పగించి, తమ సొమ్ములు రాబట్టుకుంటున్నారు. దీంతో నగరంలో జరుగుతున్న పనులు నాసిరకంగా ఉంటూ ప్రజలకు సౌకర్యం కాకుండా ఇబ్బందులు కలిగిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

కార్పొరేషన్ ఇన్‌చార్జి ఎస్ఈ రంజిత్ కుమార్

‘ఖమ్మం నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే బిల్లులు చెల్లిస్తాం. ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బంది కొరతతో ప్రతి పనిని తనిఖీ చేయలేకపోతున్నాం. పనులు పూర్తయిన తర్వాత కోర్ టెస్ట్ ద్వారా నాణ్యత ప్రమాణాలను నిర్ణయిస్తాం. కోర్ టెస్ట్ ను స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్వహిస్తారని, దాని ఆధారంగానే బిల్లులు చెల్లిస్తాం. కాంట్రాక్టర్లు అవినీతి పాల్పడితే బ్లాక్ లిస్టులో పెడతాం.’

Next Story