- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిట్నెస్ లేదు.. కానీ పర్మిషన్ ఉంది..!
జిల్లాలో ‘స్కూల్ బస్’ దందా కాసులు కురిపిస్తున్నాయి.

దిశ, కొత్తగూడెం: సోమవారం నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. పుస్తకాల సంచులు సర్దుకుని, ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల ప్రాణాలపై ‘ఫిట్‌నెస్’ లేని స్కూల్ బస్సులు మృత్యుశకటాలై పొంచి ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, రవాణా శాఖ అధికారుల మధ్య నడుస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’ వ్యవహారం ఇప్పుడు విద్యార్థుల భద్రతను గాల్లోకి నెట్టేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తుక్కు కింద కొనుగోలు చేసిన కాలం చెల్లిన బస్సులను జిల్లాలోకి తీసుకొచ్చి, ఎలాంటి నిబంధనలు పాటించకుండానే స్కూల్ బస్సులుగా తిప్పేందుకు రంగం సిద్ధమైంది.
ఇతర రాష్ట్రాల ‘రిజెక్టెడ్’ బస్సులే ఇక్కడ శరణ్యం!
పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో నిబంధనల ప్రకారం కాలపరిమితి ముగిసి, రోడ్డుపై తిరగడానికి పనికిరావని తేల్చేసిన బస్సులను ఇక్కడి ప్రైవేట్ విద్యాసంస్థలు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నాయి. ఆ బస్సులకు రంగులు మార్చి, పైన ‘స్కూల్ బస్’ అని బోర్డులు తగిలించి యథేచ్ఛగా రోడ్లెక్కిస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులకు ఉండాల్సిన ఎమర్జెన్సీ డోర్లు, స్పీడ్ గవర్నర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, సరైన బ్రేకింగ్ సిస్టమ్స్ వంటివేవీ ఈ బస్సుల్లో ఉండటం లేదు. అయినా సరే, ఆర్టీఏ కార్యాలయాల్లో ‘అడగకుండానే’ వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ అయిపోతుండటం గమనార్హం.
టార్గెట్ మిస్... ఇప్పటికీ సగం బస్సులకు ఫిట్‌నెస్ లేదు.!
మరో 48 గంటల్లో పాఠశాలలు తెరుచుకోనున్నప్పటికీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్లో సగానికి పైగా బస్సులు ఇప్పటివరకు కనీసం ఫిట్‌నెస్ పరీక్షలకే రాలేదు. జిల్లా వ్యాప్తంగా 254 స్కూల్ బస్సులకు 156 అసలు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వంద శాతం బస్సుల తనిఖీలు పూర్తి కావాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఫిట్‌నెస్ లేని బస్సులను కనీసం గ్యారేజీల నుంచి బయటకు తీయకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
స్క్రాప్ బస్సుల రీ-ఎంట్రీ...
పక్క రాష్ట్రాల్లో కాలం చెల్లిన బస్సులకు ఇక్కడ కలరింగ్ ఇచ్చి స్కూల్ బస్సులుగా మారుస్తున్నారు. బ్రేకులు, టైర్లు సరిగ్గా లేకున్నా... ఎమర్జెన్సీ విండోస్ పనిచేయకున్నా ‘ఫిట్‌నెస్’ ఓకే అయిపోతోంది. నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆఫీస్ దాటి బయటకు రాకుండానే, టేబుల్ కింద చేతులు మారితే చాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ చేతికొచ్చేస్తోందని, అధికారుల అండదండలు పుష్కలంగా ఉందని ఆరోపిస్తున్నారు. జూన్ 15 నుంచి పిల్లలను నమ్మకంగా బస్సెక్కిండం ఎలా అని తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ సార్ .. కాస్త దృష్టి పెట్టండి!
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల లాభాపేక్ష, ఆర్టీఏ అధికారుల ఉదాసీనత కలసి రేపు ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కమిటీలు వేయడం, సస్పెన్షన్లు చేయడం కంటే.. ముందే ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, ఆర్టీఏ, పోలీస్ శాఖలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. బడిబాట పట్టే చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాలం చెల్లిన ‘ఇతర రాష్ట్రాల’ బస్సులను సీజ్ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా రవాణా అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. కొత్తగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ ను వివరణ కోరగా... ఫిట్నెస్ లేకపోతే అనుమతులు ఇవ్వడం కుదరదని, నిబంధనల ప్రకారమే అనుమతులు జారీ చేస్తున్నామని, అనుమతులు లేకుండా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






