ఆ దమ్ము మీకుందా...? : ఎమ్మెల్యే రేగా బహిరంగ సవాల్

by Dishanational1 |
ఆ దమ్ము మీకుందా...? : ఎమ్మెల్యే రేగా బహిరంగ సవాల్
X

దిశ, మణుగూరు: రాష్ట్రంలో అర్హులందరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలోని అశోక్ నగర్ ఏరియాలోని గిరిజన భవనంలో మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాలకు చెందిన పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ణాత్మకంగా అందిస్తున్న ఆసరా పెన్షన్ కార్డులు, పత్రాలను పంపిణీ చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ... రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయడమే సీఎం కేసీఆర్ లక్షమన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ప్రతి నిత్యం పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, నియామకాలు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా అని అన్నారు. ఇదే 28 రాష్ట్రాలకు దమ్ముంటే కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను చూసి తట్టులేకపోతుందని ఎద్దేవా చేశారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎంత పెన్షన్ ఇచ్చిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 1000 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,016 పెన్షన్ ఇస్తున్న ఘనత కేసీఆర్ దేనన్నారు. అలాగే దసరా నుంచి సీఎం కేసీఆర్ నీరు పేద ప్రజలకు ఆర్ధిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు.

ఇంటి జాగా ఉన్న నీరు పేదలందరికీ ఇల్లు నిర్మించబోతున్నారని తెలిపారు. ఇప్పటికే ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించారని తెలిపారు. దీంతో దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తోందని గుర్తు చేశారు. దేశం మొత్తం గర్వించేలా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయనపై నిందలు వేస్తున్నాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత నిందలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, ఎండీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read: TRS మంత్రుల మధ్య కోల్డ్ వార్.. చిచ్చు పెట్టింది ముఖ్యమంత్రి టూరేనా?


Next Story

Most Viewed