మణుగూరులో పునర్నిర్మించిన 'భవిత' భవనం.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

by Kodari Anjali |

నూతనంగా పునర్నిర్మించిన భవిత భవనాన్ని (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు.

మణుగూరులో పునర్నిర్మించిన భవిత భవనం.. ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
X

దిశ, బూర్గంపాడు/​మణుగూరు: మణుగూరు మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.3 లక్షల వ్యయంతో నూతనంగా పునర్నిర్మించిన భవిత భవనాన్ని (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి భవనాన్ని లబ్ధిదారులకు అంకితం చేశారు.​అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, వారి కుటుంబాలకు మెరుగైన సేవలు, సరైన వసతులు అందించేందుకు భవిత కేంద్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ భవిత భవన పునర్నిర్మాణం ద్వారా ఇక్కడ అందించే సేవల నాణ్యత పెరగడమే కాకుండా, పిల్లలకు మరింత అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవన ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే అక్కడి పిల్లలతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.​ ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవోలతో పాటు మండల విద్యాధికారి (ఎంఈవో) స్వర్ణజ్యోతి, ఐఈఆర్పీలు నాగశ్రీ, వీరు నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, కేంద్ర సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story