కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని

by Kodari Anjali |

కార్మిక హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి: ఎమ్మెల్యే కూనంనేని
X

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు భంగం కలిగించే చర్యలను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని కొత్తగూడెం శాసనసభ్యులు, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిఓఏ క్లబ్‌లో ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశం మొదటి రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యేతో పాటు యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా, గత నెల గోలేటి నుండి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి నాయకుడికి ప్రతి కార్మికుడికి, నాయకుడికి, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. సమావేశంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా క్రింది డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలన్నారు.

సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారానికి..

ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని, మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, పెర్క్స్‌పై విధిస్తున్న ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలన్నారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న డిమాండ్లను అమలు చేయాలని, క్లర్క్ పోస్టుల భర్తీకి కోర్టు కేసుతో సంబంధం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు యూనియన్ కొమురయ్య కాంస్య విగ్రహం పునపారంభోత్సవానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, సెంట్రల్ సెక్రటరీలు, వంగ వెంకట్, వీరస్వామి, అన్ని ఏరియాల బ్రాంచ్ సెక్రెటరీలు, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు పాల్గొన్నారు.

Next Story