ఇల్లందు ఆరోగ్య రంగానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య వినతి

by Kodari Anjali |

మంత్రి దామోదర రాజనర్సింహను ఇల్లందు ఎమ్మెల్యే అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కలిసి నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు.

ఇల్లందు ఆరోగ్య రంగానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య వినతి
X

దిశ, ఇల్లెందు: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గంలో నూతన నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన నర్సింగ్ విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. అదేవిధంగా, ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడకల ఐసీయూ, నూతన అంబులెన్స్ వాహనం, సీటీ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగుపడి ప్రజలకు మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. అలాగే ఇల్లందు, టేకులపల్లి మండలాల పరిధిలోని చల్లసముద్రం, సుదిమళ్ల, బోడు గ్రామాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు చేరువయ్యేలా కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి, ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి సాధ్యమైన మేరకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

Next Story