ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి పెద్దపీట: మంత్రి పొంగులేటి

by Kodari Anjali |

తిరుమలాయపాలెంలో 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు.

ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి పెద్దపీట: మంత్రి పొంగులేటి
X

దిశ, తిరుమలాయపాలెం: ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కు, విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గతంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా కారణంగా పొలాలకు వెళ్లిన రైతులు పాముకాటుకు గురయ్యే వారని తెలిపారు. మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా మెరుగుదలకు..

పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. గత రెండున్నరేళ్లలో పాలేరు నియోజక వర్గంలో విద్యుత్ శాఖ అభివృద్ధి పనుల కోసం రూ.37.38 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు. ఇళ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. రూ.9 కోట్ల వ్యయంతో మూడు సబ్‌స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం..

అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాసచారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య,స్థానిక సర్పంచ్ సుజాత-నరసింహరావు, పాలేరు ఆత్మకమిటి చైర్మన్ చావా శివరామకృష్ణ, నాయకులు రామసహయం నరేశ్ రెడ్డి, బెల్లం శ్రీనివాస్, బోడ మంగీలాల్, తాటికొండ కిరణ్ కుమార్, పోట్ల కిరణ్,దూదిమెట్ల వెంకట్, గోళ్ళ లింగయ్య, ఉప్పునూతల నాగేశ్వరరావు, అధికారులు తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ప్రజాప్రతినిధులు,విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story