- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు మృతి
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, లింగాలఘణపురం: జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని నవాబుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న లారీ, సూర్యాపేట నుంచి జనగామ వైపు వస్తున్న స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హనుమకొండ జిల్లా లస్కర్‌బజార్‌కు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ (28), కాజీపేటకు చెందిన కారు డ్రైవర్ మహమ్మద్ సుభాన్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న హనుమకొండ జిల్లాకు చెందిన మహమ్మద్ మసీద్, సమీర్, ఖమ్మం జిల్లాకు చెందిన మహమ్మద్ నూర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తొలుత జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతులు మరియు గాయపడిన వారు వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాదాలకు నిలయంగా మారిన నవాబుపేట మూలమలుపు
నవాబుపేట గ్రామ సమీపంలోని మూలమలుపు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి అయినప్పటికీ, ఈ మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు చివరి క్షణం వరకు కనిపించకపోవడంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం కష్టమవుతోందని వాహనదారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.






