మెడికల్ ఇన్వాలిడేషన్ మాఫియా: సింగరేణి ప్రతిష్టకు మచ్చ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-23 02:30:01  IST  )

మెడికల్ బోర్డులో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలతో సింగరేణి ప్రతిష్ట మసకబారుతోంది. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా కొందరు యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు దళారుల ద్వారా ఒక్కో కార్మికుడి వద్ద నుంచి రూ.6నుంచి రూ.8లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

మెడికల్ ఇన్వాలిడేషన్ మాఫియా: సింగరేణి ప్రతిష్టకు మచ్చ
X

దిశ, కొత్తగూడెం : మెడికల్ బోర్డులో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలతో సింగరేణి ప్రతిష్ట మసకబారుతోంది. మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా కొందరు యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు దళారుల ద్వారా ఒక్కో కార్మికుడి వద్ద నుంచి రూ.6నుంచి రూ.8లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా కార్మికుడి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును ఎవరివి వారికి వాటాలుగా చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెడికల్ బోర్డు ఇన్వలిడేషన్ దందాను ముఠా సభ్యులు అత్యంత రహస్యంగా, ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారని సమాచారం. ఓ కార్మికుడి వద్ద నుంచి ఈ ముఠా సభ్యులు డబ్బు లావాదేవీలు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా ధన రూపంలో తీసుకుంటారని, డబ్బు చెల్లించిన కార్మికులకు సినీ ఫక్కిలో ఒక కోడ్‌ను చెబుతారని తెలుస్తున్నది. ఈ కోడ్ ద్వారా మెడికల్ బోర్డులోని వైద్యులు వారిని గుర్తించి మెడికల్ అన్‌ఫిట్ చేస్తారని సమాచారం. మెడికల్ బోర్డు అవినీతిలో కొందరు యూనియన్ నాయకులు, డాక్టర్ల హస్తం ఉందని తెలుస్తున్నది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో పెద్దవాళ్లను తప్పించి, కిందిస్థాయి సిబ్బందిని బలిపశువులను చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

సింగరేణి సంస్థ రాష్ట్రానికి వెలుగులు అందిస్తుంటే, ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు అవినీతిపరులు సింగరేణి ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం సంస్థ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒకే కుటుంబం - ఒకే లక్ష్యం - ఒకే గమ్యం నినాదంతో సంస్థ పురోగతిని సాధిస్తోంది. రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న సింగరేణి సంస్థకు అవినీతి చీడ మాత్రం విడవడం లేదు. మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన్ ప్రక్రియలో భాగంగా కొందరు యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు దళారుల ద్వారా ఒక్కో కార్మికుని వద్ద నుంచి రూ.6 నుంచి రూ.8లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వసూలు చేసిన డబ్బులను ఎవరివి వారికి వాటాలుగా చేరవేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో హైదరాబాద్ నుంచి మెడికల్ బోర్డు నిర్వహణ కోసం వచ్చే కొందరు డాక్టర్లకు కూడా భాగస్వామ్యం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొదట్లో ఒక్కో కేసుకు రెండు లక్షలు ఉండగా, ప్రస్తుతం వాటాలు పెరగడంతో ఒక్కో మెడికల్ ఇన్వాలిడేషన్ కేసుకు రూ.6 నుంచి రూ.8లక్షల వరకు దళారులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నా డబ్బు ముట్టజెబితే, మెడికల్ అన్‌ఫిట్ చేస్తారు, కార్మికుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఒకవేళ డబ్బు కట్టే పరిస్థితి లేకపోతే మెడికల్ అన్‌ఫిట్ అవ్వడం దాదాపు అసాధ్యమనే చర్చ జరుగుతోంది. ఒక్కో కేసుకు ఇంత అని కొందరు వైద్యులకు, హైదరాబాదులోని ఉన్నత స్థాయి అధికారి తమ్ముడికి, మరి కొంతమంది అధికారులకు ఇందులో వాటాలు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.

మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితా దళారులకు చేరుతుంది. సింగరేణిలోని 11ఏరియాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు మెడికల్ ఇన్వాలిడేషన్‌కు దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న జాబితాతో దళారులు ముందు రంగంలోకి దిగుతారు డబ్బు ముట్టజెప్తేనే తమకు పని అవుతుందని, తద్వారా తమ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం కూడా వస్తుందని, హైదరాబాద్ నుంచి వచ్చే డాక్టర్లు మనవాళ్లే అంటూ కార్మికుల వద్ద నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ అధికారులు పలుమార్లు ఈ అవినీతి దందాపై దృష్టి సారించినప్పటికీ సింగరేణిలో మెడికల్ బోర్డు అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. దళారులకు సొమ్ము ముట్టజెప్పిన కార్మికుడు ఎక్కడ కూడా ఫిర్యాదు చేయకపోవడం, అదేవిధంగా ఆ డబ్బు తీసుకున్న దళారులు, కొందరు యూనియన్ లీడర్లు, కుల సంఘ నాయకులు,రాజకీయ నాయకులు తాము తీసుకున్నట్లు ఎక్కడా నోరు మెదపకపోవడంతో నిఘా సంస్థలకు ఇది అతి పెద్ద సమస్యగా మారింది. ఏళ్ల తరబడి విషవృక్షంలా ఈ మెడికల్ బోర్డు అవినీతి దందా పాతుకుపోవడంతో నిఘా సంస్థల అధికారులకు సైతం అసలైన సూత్రధారులను పట్టుకోవడం కష్టంగా మారింది. ఏసీబీ అధికారులు ఈ అవినీతిలో భాగస్వామ్యం అవుతున్న యూనియన్ , కుల సంఘం, రాజకీయ నాయకుల జాబితా సేకరించి వారి ఆస్తుల వివరాలు, బినామీ ఆస్తుల వివరాలు రాబడితే తప్ప ఈ దందా ఆగదనే చర్చ జరుగుతుంది.

అంతా రహస్యంగానే..

మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన్ దందాను అత్యంత రహస్యంగా, ప్రణాళిక ప్రకారం ముఠా సభ్యులు నిర్వర్తిస్తారు. తొలుత మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న జాబితాలో నుంచి కార్మికుల వద్ద నుంచి అడ్వాన్సుగా కొంత డబ్బును సేకరిస్తారు. మొత్తం 11ఏరియాల నుంచి ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు డబ్బు చెల్లిస్తారో, వారి పేర్లతో మాత్రమే మరొక లిస్టును తయారుచేసి ఆ లిస్టులో ఉన్న కార్మికులను మాత్రమే మెడికల్ ఇన్వాలిడ్ చేస్తారని సమాచారం. ఈ జాబితాను మెడికల్ బోర్డులో పాల్గొనే కొందరి వైద్యులకు ముందస్తుగానే చేరుస్తారని , వారిని మాత్రమే మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటిస్తారని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఈ డబ్బు లావాదేవీలు జరిపే సమయంలో ఎటువంటి పరిస్థితులలో కూడా వీరు ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ వంటివి ఉపయోగించరు. కేవలం ధన రూపంగానే తీసుకుంటారు. మెడికల్ బోర్డు తేదీలు ప్రకటించిన మూడు రోజుల ముందు నుంచి ఈ దళారులు మాయమైపోతారు. పాల్వంచ, భద్రాచలం, వరంగల్‌లో లాడ్జిలలోని రూములను బుక్ చేసుకొని నేరుగా కార్మికులను అక్కడికే పిలిపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దళారుల ద్వారా మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులకు సినీ ఫక్కిలో ఒక కోడ్‌ను చెప్తారు. ఆ కోడ్ ప్రతిసారి మారిపోతుంటుంది. ముందుగానే డబ్బు చెల్లించిన వారికి ఒకే రంగు పెన్ జేబులో పెట్టుకోవాలని, లేదా మెడలో ఒకే రంగు రుమాలు వేసుకోవాలని నిర్దేశిస్తారు. ఈ కోడ్ ద్వారా వైద్యులు వారిని గుర్తించి వారి వద్ద ఉన్న జాబితాలో పేరును సరిచూసుకొని వారిని మెడికల్ అన్ ఫిట్ చేసేస్తారు.

వారిదే కీలక పాత్ర

మెడికల్ బోర్డు అవినీతిలో కొందరు యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు, మరొక కుల సంఘం నాయకుడితో పాటు మెడికల్ బోర్డులో పాల్గొంటున్న కొంతమంది డాక్టర్లకు కూడా పాత్ర ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. రాజకీయ ఒత్తిడితో విజిలెన్స్ అధికారులు వీరిపై ఎటువంటి చర్యలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ యూనియన్ నాయకుడి అనుచరుడు మెడికల్ బోర్డులో వచ్చిన డబ్బులతో రూ.20లక్షల అప్పు తీర్చానని తన అనుచరుల వద్ద బాహటంగానే చర్చించినట్టు తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఉద్యోగ సంఘాల నాయకుడు ఏకంగా తాను సంస్థలో పనిచేస్తున్న సింగరేణి భవన్‌లోని ఉన్నతాధికారి మనిషినని ప్రచారం చేసి మెడికల్ ఇన్వాలిడేషన్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా కొత్తగూడెం నడిబొడ్డులోని ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ ని తన అడ్డాగా మార్చి కార్మికుల వద్ద నుంచి భారీ మొత్తం లో డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోరాటాల పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ యూనియన్‌కు చెందిన నాయకుడు ఇటీవల ఓ కార్మికుని వద్ద నుంచి మెడికల్ అన్ఫిట్ చేపిస్తానని లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. పని కాకపోయే సరికి కార్మికుడు తిరగబడడంతో తీసుకున్న డబ్బుల్లో కొంత భాగాన్ని మినహాయించుకుని ఫోన్‌ పే ద్వారా తిరిగి ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా కొన్ని యూనియన్లకు చెందిన కొంతమంది లీడర్లు విధులకు హాజరు కాకుండా, కుల సంఘాలని అడ్డం పెట్టుకొని , తాము ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితులమని బాకాలు కొట్టుకుంటూ, మెడికల్ అన్‌ఫిట్ కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. బయటికి మాత్రం తాము అత్యంత నీతిమంతులమని గొప్పలకు పోతున్నారు. వీరంతా కలిసి వసూలు చేసిన డబ్బుల వాటాలను కొంతమంది డాక్టర్లకు చేరవేస్తున్నారని సమాచారం.

పెద్దవాళ్లు ఎస్కేప్

రాజకీయ ఒత్తిళ్లతోటే మెడికల్ అన్‌ఫిట్ దందాలో భాగస్వామ్యం ఉన్న అధికారులను, లీడర్లను, డాక్టర్లను పక్కకు తప్పిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరి మీద చర్యలు తీసుకోలేక పెద్ద వారిని కాపాడేందుకు, పిచుకలపై బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారని, అసలు సూత్రధారులు ఎవరో తెలిసినా తెలియనట్లు సింగరేణి విజిలెన్స్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మార్చి31న గత సీఎంఓను విజిలెన్స్ విభాగం అధికారులు విచారణ పేరుతో హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను, మాజీ సీఎంఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ పేరుతో హడావుడి చేసిన విజిలెన్స్ అధికారులు ఒక రోజులోనే మాజీ సీఏఎంఓను విడిచి పెట్టేశారు. దీని వెనక ఒక అదృశ్య శక్తి ఉండి మాజీ సీఎంఓను కాపాడినట్లు సమాచారం. ఉన్నత స్థాయి అధికారులను, యూనియన్ లీడర్లను ఏమి చేయలేక, కింది స్థాయి ఉద్యోగులపైనే ప్రతాపం చూపుతున్నారని విజిలెన్స్ విభాగంపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా నిఘా సంస్థల అధికారులు, ప్రభుత్వ అధికారులు మెడికల్ అన్‌ఫిట్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కార్మికులు కోరుకుంటున్నారు.

మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహిస్తాం : కిరణ్ రాజ్ కుమార్, సీఎంఓ డాక్టర్

సింగరేణిలో నేను సీఎంఓగా ఏప్రిల్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నాను. గతంలో జరిగిన మెడికల్ బోర్డు వ్యవహారం పై నాకు అవగాహన లేదు. విజిలెన్స్ అధికారులు, ప్రభుత్వం మెడికల్ బోర్డుపై దృష్టి సారించింది. మెడికల్ బోర్డు పారదర్శకంగా నిర్వహిస్తాం. మెడికల్ బోర్డుకు వచ్చిన కార్మికులలో అసలైన వారిని మాత్రమే గుర్తించి అన్ఫిట్ చేస్తాం. ఎవరైనా దళారులు ప్రలోభ పెడితే నేరుగా మా కార్యాలయానికి గాని, సింగరేణి విజిలెన్స్ అధికారులకు గాని, పోలీస్ అధికారులకి కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఎంతటి వారినైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోం. నేను విధుల్లో చేరినప్పటి నుండి మెడికల్ బోర్డు నిర్వహించలేదు. సింగరేణి సంస్థ యాజమాన్యం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు మెడికల్ బోర్డు నిర్వహిస్తాం.

Next Story