- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెప్టిక్ ట్యాంకులు తెచ్చే వ్యర్థాలు ఎఫ్ ఎస్టీపీ కు వచ్చేలా చర్యలు తీసుకోవాలి : కమిషనర్
నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంకుల నుండి సేకరించిన మలిన వ్యర్ధాలు పీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ )కు చేరేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంకుల నుండి సేకరించిన మలిన వ్యర్ధాలు ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ )కు చేరేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు. నగరం లోని దానవాయిగూడెం లో ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను కమిషనర్ గురువారం పరిశీలించారు. 2024 సెప్టెంబర్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా నీటమునిగిన ఎఫ్‌ఎస్‌టీపీని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పునరుద్ధరించి తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌టీపీలో పనిచేస్తున్న కార్మికులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహించే సమయంలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు ధరించి సురక్షితంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కార్మికులకు కిట్లు, రూ.5 లక్షల ప్రమాద బీమా (ఇన్సూరెన్స్) కార్డులు అందజేశారు. ప్రతిరోజూ 10 నుండి 15 సెప్టిక్ ట్యాంకర్ల ద్వారా వచ్చే మలిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి అవసరమైన వనరులు, సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఎస్‌టీపీలో రోజుకు సుమారు 70 కిలోలీటర్ల మలిన వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్నట్లు అధికారులు కమిషనర్ కు వివరించారు. ఏ రోజు వచ్చిన మలిన వ్యర్థాలను అదే రోజు శుద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
అలాగే, ప్రతి కార్మికుడు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. నగరంలోని అన్ని సెప్టిక్ ట్యాంకుల మలిన వ్యర్థాలు తప్పనిసరిగా ఎఫ్ఎస్టీపీ కు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్ నరేంద్ర తేజ గారు, సీవీర్ జేవీ ఎం.డి. త్రిభువన్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ మేనేజర్ సంజయ్, ప్లాంట్ సూపర్వైజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.






