మేయర్.. పుర పీఠాల్లో మహిళలకే ప్రాధాన్యం

by Thanuru Gopichand |

మొదలైన పురపోరు సందడి.

మేయర్.. పుర పీఠాల్లో మహిళలకే ప్రాధాన్యం
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్/ కొత్తగూడెం ప్రతినిధి : ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 7మున్సిపాలిటీలకు కలెక్టర్లు లాటరీ ద్వారా రిజర్వేషన్లు ప్రకటించారు. కార్పొరేషన్లు, పురపాలిక పీఠాలు ఎక్కువ భాగం మహిళలకు కేటాయించడం ద్వారా మహిళా ప్రాతినిధ్యానికి పెద్దపీట వేశారు. ఇవే కాకుండా జనరల్ స్థానాల్లోనూ వీరు పోటీపడనున్నారు. దీంతో పదవుల్లోనూ పెద్ద మొత్తంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఖమ్మం మేయర్ పీఠం జనరల్ మహిళ, కొత్తగూడెం మేయర్ పీఠం ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక మున్సిపాలిటీల్లోనూ అతివలకే ప్రాధాన్యమిచ్చారు. మధిర మున్సిపాలిటీలో జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, వైరా మున్సిపాల్ పీఠం జనరల్ మహిళకు, ఏదులాపురం చైర్మన్ ఎస్సీ మహిళకు, సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ మహిళకు, కల్లూరు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ స్థానం బీసీ మహిళకు కేటాయించారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కొత్తగూడెం కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఎప్పుడు విడుదల అవుతాయోనని కొన్ని రోజులుగా ఎదురుచూసిన ఆశావాహుల ఉత్కంఠకు తెరపడింది. శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది. మొత్తం 60డివిజన్లు ఉండగా ఎస్సీలకు 12( మహిళలు 6, జనరల్ 6), ఎస్టీలకు 11 సీట్లు ( మహిళలు 5, జనరల్.6), బీసీలకు 7 సీట్లు( మహిళలు 3, జనరల్ 4), అన్‌రిజర్వ్‌డు జనరల్ మహిళలు 16స్థానాలు, జనరల్ 14 స్థానాలను కేటాయించారు.

ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం మేయర్ పీఠం జనరల్ మహిళకే ఖరారు అయింది. దామాషా ప్రకారం ఈసారి ఖమ్మం మేయర్ గా బీసీలకు అవకాశం వస్తుందనుకున్నారు. అయితే మహిళా రిజర్వేషన్లలో భాగంగా ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు దక్కింది. ఖమ్మం కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఖమ్మం మేయర్ పదవి ఎస్టి జనరల్ అయింది. అప్పుడు ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ సూపరిండెంట్ డాక్టర్ పాపాలాల్ కు అనూహ్యంగా మేయర్ పదవి దక్కింది. అనంతరం రెండోసారి మేయర్ పదవి రిజర్వేషన్ ప్రకారం మహిళా జనరల్ కు కేటాయించగా 25 డివిజన్ కార్పొరేటర్ పునుకొల్లు నీరజ మేయర్‌గా ఎంపికయ్యారు.

ఈసారి జనరల్ మహిళకే అవకాశం..

ఈసారి కూడా ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకే రిజర్వు అయింది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత రెండో పాలకవర్గంలో మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కాగా ఈసారి కూడా జనరల్ మహిళకే రిజర్వ్ అయింది. దీంతో మేయర్ పదవికి పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

ఖమ్మం జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..

దిశ, మధిర : మధిర మున్సిపాలిటీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. అత్యధికంగా 12వార్డులు మహిళలకే కేటాయించారు. ఆరు వార్డులు జనరల్ మహిళలకు, బీసీ మహిళలకు2 , ఎస్సీ మహిళలకు3, ఎస్టీ మహిళలకు ఒకటి రిజర్వేషన్ అయింది. ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీలో ఐదు స్థానాలు, బీసీ కేటగిరీలో రెండు స్థానాలు, ఎస్సీ కేటగిరీలో మూడు స్థానాలు కల్పించారు.

వైరా : వైరా మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 20 వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మున్సిపాలిటీలో అత్యధికంగా ఆరు వార్డులు జనరల్ మహిళలకు రిజర్వేషన్ కావటం విశేషం. నాలుగు వార్డులు జనరల్‌కు, రెండు వార్డులు బీసీ మహిళలకు, మరో రెండు వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మూడు వార్డులు ఎస్సీ జనరల్‌కు, రెండు వార్డులు బీసీ జనరల్‌కు, ఒక వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ చేశారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లోని ఆశావహులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ఖమ్మం రూరల్ : ఏదులాపురం 32 వార్డులకు గాను రిజర్వేషన్‌లు ప్రకటించారు. చైర్మన్‌గా ఎస్సీ మహిళకు కేటాయించారు. మొత్తం 32వార్డులకు గానూ ఎస్టీకి 3, బీసీకి 6, ఎస్సీకి 6, జనరల్‌కు16గా ప్రకటించారు.

సత్తుపల్లి : సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 23 వార్డుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అత్యధికంగా 8వార్డులు జనరల్ మహిళలకు రిజర్వేషన్ కావడం విశేషం.

కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వార్డుల రిజర్వేషన్‌లను అధికారులు ప్రకటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్టీ జనరల్ రిజర్వ్ అయింది. కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20వార్డులు ఉండగా.. అందులో మూడు వార్డులు ఎస్టీ, ఐదు వార్డులు ఎస్సీ, రెండు వార్డులు బీసీ, పది వార్డులు జనరల్ కాగా ఆరు మహిళలకు రిజర్వు కాగా నాలుగు వార్డులు అన్ రిజర్వుడ్ జనరల్ గా ఖరారయ్యాయి.

భద్రాద్రి జిల్లాలో ఇలా..

ఇల్లెందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, ఎస్టీలకు 2( మహిళ 1, జనరల్ 1), ఎస్సీలకు 4 (మహిళ 2, జనరల్ 2), బీసీలకు 6(మహిళ 3, జనరల్ 3), అన్ రిజర్వ్డ్ విభాగంలో మహిళా జనరల్ 6, జనరల్ 6 వార్డులను కేటాయించారు.

అశ్వారావుపేట జనరల్ మహిళ

అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వార్డుల రిజర్వేషన్ లను అధికారులు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఖరారైన వార్డుల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రకటించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22వార్డులు ఉండగా.. అందులో మూడు వార్డులు ఎస్టీ, నాలుగు వార్డులు ఎస్సీ, మరో నాలుగు వార్డులు బీసీ, ఆరు వార్డులు జనరల్ మహిళగా రిజర్వు కాగా ఐదు వార్డులు అన్ రిజర్వుడ్ గా ఖరారయ్యాయి.

Next Story