లక్కీ నెంబర్ "12".. రెండు పార్టీల సైతం ఆ సంఖ్య పైనే ధీమా

by Nallavelli.Anjaneyulu |

వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో లక్కీ నెంబర్ "12" రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు 12 సంఖ్య పై దీమా వ్యక్తం చేస్తున్నాయి

లక్కీ నెంబర్ 12.. రెండు పార్టీల సైతం ఆ సంఖ్య పైనే ధీమా
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో లక్కీ నెంబర్ "12" రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు 12 సంఖ్య పై దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కౌన్సిలర్ల గెలుపు విషయంలో లెక్కల మీద లెక్కలు వేసుకుంటున్నాయి. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ తాము 12 వార్డులకు పైగా గెలుస్తామని దీమా వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా తాము 12 సీట్లు గెలుస్తామనే ధైర్యంతో ఉంది. అయితే ఆ రెండు పార్టీలు 12 సంఖ్యకు మించి తమకు వార్డులు వస్తాయని చెప్పకపోవడం విశేషం. దీంతో వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎన్నికల పోరు పోటాపోటీ గానే ఉందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ 3, 4, 6, 7, 9, 10, 12, 13, 14, 20 వార్డులతో పాటు 15 నుంచి 19 వార్డుల్లో మరో రెండు వార్డులు గెలుస్తామనే స్పష్టమైన అంచనాలో ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1, 2, 5, 8, 9, 10, 11, 16, 17, 18, 19 వార్డుల తో పాటు పోటా పోటీగా ఉన్న వార్డుల్లో ఏదో ఒకటి గెలుస్తామనే ఆలోచనలో ఉంది.


దీంతో ఈ రెండు పార్టీలు 12 సంఖ్య పైనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో గతంలో ఏన్నడు లేని విధంగా డబ్బు ప్రభావం కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. లాలాపురంలోని 19వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిని చింతనిప్పు సులోచన, బీఆర్ఎస్ అభ్యర్థిని దామా ఉమా పోటాపోటీగా ఓటుకు రూ. 5 వేలు ఇప్పటికే పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా వేలం పాట మాదిరిగా ఓటుకు రూ.10వేలు వరకు పంపిణీ చేసేందుకు ఆ ఇద్దరు అభ్యర్థినులు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు దిద్దుపుడిలోని 15వ వార్డులో కూడా ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థినిలు రాంపూడి రాజ్యలక్ష్మి, నల్లమోతు శైలజ ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేశారు. ఇక్కడ కూడా ఓటుకు సుమారు రూ.5 వేలు వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైరా పట్టణంలోని వార్డుల్లో రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు ఓటుకు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి దీటుగా ఆర్థిక వ్యవహారాల్లో ముందుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇచ్చే నగదు కంటే తమ పార్టీ తరఫున ఓటర్లకు ఎక్కువ నగదు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో లక్కీ నెంబర్ 12 ఏ పార్టీను వరిస్తుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Next Story