తప్పొకరిది.. శిక్ష మరొకరికి.. కేఎంసీలో నయా దందా.. పట్టుబడితే కిందిస్థాయి ఉద్యోగులే బలి!

by Ramesh Naini |

ఖమ్మం కార్పొరేషన్‌లో కొందరు అధికారుల అవినీతికి కిందిస్థాయి ఉద్యోగులు బలైపోతున్నారు.

తప్పొకరిది.. శిక్ష మరొకరికి.. కేఎంసీలో నయా దందా.. పట్టుబడితే కిందిస్థాయి ఉద్యోగులే బలి!
X

ఖమ్మం కార్పొరేషన్‌లో కొందరు అధికారుల అవినీతికి కిందిస్థాయి ఉద్యోగులు బలైపోతున్నారు. నగరంలోని ఓ ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా అప్పట్లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి ఆసుపత్రి నిర్మాణదారులతో బేరం సాగించారు. ఆస్తి పన్ను తగ్గిస్తానని లక్షలాది రూపాయలు చేతులు మారాయి. తన చేతికి మట్టి అంటకుండా సదరు రెవెన్యూ అధికారిణి (ఆర్ఐ) లాగిన్‌లో నుంచి ఆస్తి పన్నును ఖరారు చేశారు. అసలు సంగతి తెలవని మహిళా ఆర్ఐ సస్పెన్షన్‌కు గురైంది. ఓ వ్యాపారికి ఆస్తి పన్ను ఖరారు, ట్రేడ్ లైసెన్స్ ఇప్పించేందుకు ఓ బిల్ కలెక్టర్ తనకు సహాయకుడిగా ఉన్న ప్రైవేటు వ్యక్తి ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. పని కాకపోవడంతో ఆ వ్యాపారి కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా తనకేం తెలియదని తన సహాయకుడే సొమ్ములు వసూలు చేశారని చెప్పి సదరు బిల్ కలెక్టర్ తప్పించుకున్నారు. దీంతో చేయని తప్పుకు సహాయకుడు బాధను అనుభవిస్తున్నాడు. ఈ ఘటనలు బహిరంగమైనప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో నయా దందా మొదలైంది. ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్ లో ఈ దందా కొనసాగిస్తున్నారు. కొందరు పై స్థాయి వ్యక్తులు లంచాలకు అలవాటు పడి భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగులను దీనిలో బలిపశువులుగా వాడుతున్నారని చర్చ జరుగుతోంది. పై స్థాయి ఉద్యోగుల పైశాచికత్వానికి ఒక మహిళా ఆర్ఐ బలై సస్పెన్షన్ వేటు పడి తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నది. ఎంతో నిజాయితీగా పనిచేసే ఉద్యోగిగా పేరు ఉన్న ఆమె సస్పెన్షన్ కావడం గతంలోనే చర్చకు దారితీసింది.

రెవెన్యూ విభాగంలో భారీగా అవినీతి..

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అంటేనే అవినీతికి కేరాఫ్‌గా నిలిచింది. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఖరారు ఈ విభాగం పరిధిలోనే ఉంటాయి. దీంతో ఇక్కడ భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. నివాస గృహ కొలతలు తగ్గించడం, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల తగ్గించడం వంటి చర్యలకు పాల్పడుతూ గృహ యజమానులు, వ్యాపారుల నుంచి భారీగా దండుకుంటున్నట్లు గతంలో పలుసార్లు బయటపడింది. అయితే తమ తప్పులను కింది స్థాయి ఉద్యోగులపై నెట్టి పై అధికారులు సేఫ్‌గా ఉండటంతో కిందిస్థాయి ఉద్యోగులు చేయని తప్పుకు బలవుతున్నారు.

భారీ నిర్మాణాలు లక్ష్యంగా..

భారీ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా బహుళ అంతస్తుల నిర్మాణాలు, అలాగే భారీ స్థాయిలో ఆసుపత్రి నిర్మాణాలు జరగడం రెవెన్యూ అధికారులకు కలిసి వచ్చింది. వారు ఆస్తి పన్ను ఖరారు కోసం దరఖాస్తు చేయగానే వెంటనే రెవెన్యూ విభాగంలో కొందరు పై స్థాయి అధికారులు బేరాలకు దిగుతున్నారు. నిర్మాణ కొలతలు తగ్గిస్తామని చెప్పి వారి నుంచి లక్షలాది రూపాయలు సొమ్ములను వసూలు చేస్తున్నారు. తద్వారా కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అధికారులు చేసిన అవినీతి బహిర్గతమైతే వెంటనే కింది స్థాయి ఉద్యోగులపై నెట్టివేసి తాము మాత్రం దొరలలా వ్యవహరిస్తున్నారు.

కిందిస్థాయి ఉద్యోగులు బలి

కొందరు పై అధికారుల అవినీతికి కిందిస్థాయి ఉద్యోగులు బలైన ఘటనలు గతంలోనూ, ఇటీవల జరిగాయి. ఖమ్మం నగరంలోని ఆదిత్య థియేటర్ సమీపంలోని చెరువు బజార్ ప్రాంతంలో ఒక ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు. సెల్ఫ్ అసెస్మెంట్ కింద ఇంటి నెంబర్, ఆస్తి పన్ను ఖరారు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి (ప్రస్తుతం బదిలీపై వెళ్లారు) చక్రం తిప్పారు. తానే స్వయంగా సదరు ఆసుపత్రి నిర్మాణదారులతో బేరం సాగించారు. ఇంకేముంది ఆస్తి పన్ను తగ్గిస్తానని లక్షలాది రూపాయలు చేతులు మారాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. తన చేతికి మట్టి అంటకుండా సదరు రెవెన్యూ అధికారి మహిళా ఆర్ఐ లాగిన్‌లో నుంచి ఆస్తి పన్నును ఖరారు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆస్తి పన్ను తగ్గింపు వ్యవహారం ఒక బిల్ కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో బయటపడింది. అయితే తప్పు చేసిన రెవెన్యూ అధికారి ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్ )లాగిన్ నుంచి అవినీతి పాల్పడటంతో అతడు సేఫ్‌గా ఉన్నాడు. అసలు సంగతి తెలవని మహిళా ఆర్ఐ మాత్రం సస్పెన్షన్‌కు గురైంది. పై అధికారి తన లాగిన్ నుంచి ఆస్తి పన్ను ఖరారు చేసి వచ్చిన ఓటీపీని అడగటంతో చెప్పి ఆమె చేయని తప్పుకు బలయింది. తాజాగా ఒక బిల్ కలెక్టర్ సహాయకుడి విషయంలో విషయంలో ఇలాగే జరిగింది. ఖానాపురం పరిధిలో ఒక వ్యాపారి ఆస్తి పన్ను ఖరారు, ట్రేడ్ లైసెన్స్ ఇప్పించేందుకు సదరు బిల్ కలెక్టర్(ప్రస్తుతం వేరే విభాగం లో వున్నాడు) లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అయితే తెలివిగా తనకు సహాయకుడిగా ఉన్న ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వసూళ్లు చేశారు.సదరు వ్యాపారి తన పని కాకపోవటంతో కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనకేం తెలియదని తన సహాయకుడే సొమ్ములు వసూలు చేశారని చెప్పి సదర్ బిల్ కలెక్టర్ తప్పించుకున్నారు. దీంతో చేయని తప్పుకు సహాయకుడు బాధను అనుభవిస్తున్నాడు. ఈ సంఘటనలు బహిరంగమైనప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తేనే కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో అవినీతికి చెక్ పడుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.

అవినీతికి పాల్పడితే క్రిమినల్ చర్యలు: కార్పొరేషన్ ఉన్నతాధికారులు

ట్రేడ్ లైసెన్సులు, ఇంటి పన్ను ఖరారు విషయంలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఆస్తిపన్ను ,ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం సొమ్ములు వసూలు చేసిన బిల్ కలెక్టర్, సహాయకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.

Next Story